తిరుపతిలో చిరంజీవి స్మరణ… అందుకేనా పవన్…

తిరుపతిలో చిరంజీవి సామాజిక వర్గానికి రాజకీయంగా మంచి పట్టు ఉంది, ఆయన్ని సొంత ఊరి ప్రజలు తిరస్కరించినా, తిరుపతి ఓటర్లు మాత్రం ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇప్పటికీ తిరుపతిలో చిరంజీవిపై సానుభూతి ఉంది. ఆ సానుభూతిని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకోసం తట్టిలేపుతున్నారు పవన్ కల్యాణ్.

చిత్తూరు జిల్లా పర్యటనలో అన్యాపదేశంగా చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారు. “చిరంజీవి లాంటి బలమైన వ్యక్తి పార్టీ పెడితే తిరుపతిలో సభకి 10లక్షలమంది వచ్చారు. అలాంటి వ్యక్తిని కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం. ఆయన గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ కి బలమైన ముఖ్యమంత్రిని చూసేవాళ్లం.” ఇవీ చిరు గురించి పవన్ చెప్పిన మాటలు.

రాజకీయాల్లో ఆశయ బలం ఉండాలని, అది ఉన్నవారికి ఓటమి కుంగుబాటు ఇవ్వదు అని చెప్పిన పవన్, చిరంజీవి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉండి ఉంటే.. సీఎం అయి ఉండేవారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వైసీపీలో మంత్రులుగా ఉన్న చాలా మంది గతంలో.. చిరంజీవి దగ్గరకు ఎలా వచ్చేవారో తనకు తెలుసని చెప్పారు. పార్టీ పెట్టిన ఇన్నేళ్లలో చిరంజీవి గురించి ఎక్కడా పవన్ ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఒకవేళ మాట్లాడినా మరీ ఇంతగా సీఎం అవుతారని ఎప్పుడూ చెప్పలేదు. హఠాత్తుగా ఇప్పుడే పవన్ కి సోదరుడు చిరు రాజకీయాలు గుర్తు రావడం, ఆయన సీఎం అయి ఉండేవారని అనడం చూస్తుంటే… తిరుపతి యాత్రకు పవన్ ఎంత ప్రిపేర్ అయి వచ్చారో అర్థమవుతుంది.

దుబ్బాక ఎన్నిక తర్వాత తిరుపతిలో పోటీ చేయడానికి బీజేపీ ఉత్సాహం చూపించింది. అందుకే వరుసగా రెండు రోజులపాటు తిరుపతిలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే వెంటనే అలెర్ట్ అయిన పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీపై ప్రకటించడం ద్వారా ఒకరకంగా బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తిరుపతి అభ్యర్థి విషయంలో అడ్డుకట్ట వేశారు. దీంతో రెండు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపుతామని చెబుతున్నాయే కానీ, ఇప్పటి వరకూ ఎవరినీ తేల్చలేదు. ఒకరకంగా తిరుపతిపై పవన్ భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే రైతు పరామర్శ యాత్ర పేరుతో తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే అన్ని కీలక నియోజకవర్గాల్లోనూ పవన్ పర్యటిస్తున్నారు.

చిరంజీవి అభిమానుల్ని ఏకం చేసే ప్రయత్నంలో భాగంగానే మెగాస్టార్ పేరుని ప్రస్తావించారు. పొత్తులో భాగంగా తిరుపతిలో జనసేన అభ్యర్థిని బరిలో దింపి, విజయం సాధించి తన సత్తా చూపించాలనుకుంటున్నారు పవన్.