చేతులు మారుతున్న సాయితేజ్ మూవీ

సాయితేజ్ హీరోగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను జీ గ్రూప్ సంస్థ గంపగుత్తగా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టోటల్ కాపీరైట్ హక్కుల్ని ఆ సంస్థ దక్కించుకుంది. సర్వ హక్కులైతే దక్కించుకుంది కానీ, తెలుగు రాష్ట్రాల్లో సినిమాను రిలీజ్ చేసేంత సత్తా ఆ సంస్థకు లేదు.

టాలీవుడ్ లో జీ గ్రూప్ కు పెద్ద పట్టు లేదు. థియేట్రికల్ బిజినెస్ అస్సలు తెలియదు. అందుకే ఇప్పుడు తన దగ్గరున్న హక్కుల నుంచి థియేట్రికల్ రైట్స్ ను వదిలించుకోవాలని చూస్తోంది ఈ సంస్థ.

ఈ నెలలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పుడీ సినిమా పంపిణీ హక్కుల్ని యూవీ క్రియేషన్స్ కు ఇచ్చే ఆలోచనలో ఉంది జీ గ్రూప్. అటుఇటుగా 8 కోట్ల రూపాయలకు రైట్స్ ఇచ్చేయాలనేది ఆలోచన.

నిజానికి సాయితేజ్ సినిమాకు ఇది తక్కువ మొత్తమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న వేళ.. ఇంతకంటే ఎక్కువ మొత్తం ఆశించలేం. అందుకే సగం ధరకే ఇచ్చేయాలని నిర్ణయించింది. డీల్ బాగుండడంతో యూవీ క్రియేషన్స్ రంగంలోకి దిగింది.