ఇవాళ్టి నుంచి తెరుచుకున్న థియేటర్లు

తెలంగాణలో ఇవాళ్టి నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రధాన జిల్లా కేంద్రాలతో పాటు.. హైదరాబాద్ లో అన్ని మల్టీప్లెక్సులు ఈరోజు ఓపెన్ చేశారు. అయితే ప్రదర్శించడానికి కొత్త సినిమాలు మాత్రం లేవు.

ఈరోజు హైదరాబాద్ థియేటర్లలో టెనెట్ రిలీజైంది. క్రిస్టోఫర్ నోలెన్ డైరక్ట్ చేసిన ఈ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీని ప్రదర్శించేందుకు మల్టీప్లెక్సులు క్యూ కట్టాయి. దాదాపు హైదరాబాద్ లోని అన్ని మల్టీప్లెక్సుల్లో టెనెట్ కనిపించింది. ఇవన్నీ ఒకెత్తయితే.. టిక్కెట్లు కూడా జోరుగా బుక్కవ్వడం మరో విశేషం. ఈరోజు దాదాపు అన్ని షోలు 90శాతం నిండాయి.

టెనెట్ తో పాటు మరో రెండు హాలీవుడ్ సినిమాల్ని ఈరోజు ప్రదర్శనకు పెట్టారు. ఇక హిందీ నుంచి వార్ మూవీని.. తెలుగు నుంచి కనులు కనులు దోచాయంటే, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు.

మల్టీప్లెక్సుల్లో అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ చెబుతోంది. ప్రవేశమార్గాల్లో స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. అయితే ఈసారి టిక్కెట్ మాత్రమే ఉంటే సరిపోదు, మాస్క్ కూడా పెట్టుకుంటేనే థియేటర్లలోకి అనుమతిస్తారు.