‘అమూల్’ ఒప్పందంతో రైతులకు లాభం – సీఎం జగన్

ఏపీ అసెంబ్లీలో వరుసగా ఐదో రోజు కూడా వాడీ వేడిగా సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం సంక్షేమ పథకాల అమలుపై చర్చలు మొదలు పెట్టారు. పింఛను గురించి చర్చ జరుగుతుండగా.. పింఛన్ల సొమ్ము పెంచలేదని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.

అనంతరం మిగతా సంక్షేమ పథకాల పై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పదేపదే సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. పలు కీలక బిల్లులు ఉన్నాయని, సహకరించాలని స్పీకర్ పదే పదే వారించినా వారు వినలేదు. చివరికి ఏడుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని స్పీకర్ ఆమోదించారు. దీంతో సభ నుంచి టీడీపీ సభ్యులు వెళ్లిపోగా, వారి వెంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వెళ్లిపోయారు.

అనంతరం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ అమూల్ ఒప్పందంపై కీలక చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో ఉంటారని అనుకున్నానని.. కానీ ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.

అమూల్ తో ఒప్పందంతో మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని, పాడి రైతులకు అదనంగా ఆదాయం వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. సభలో కీలకాంశాలపై చర్చ జరుగుతున్నా.. చంద్రబాబు తమ పార్టీ సభ్యులను పదేపదే స్పీకర్ పోడియం వద్దకు పంపి సభలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.

పదేపదే రాద్ధాంతం చేస్తున్నారని, గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత నాలుగేళ్ల వరకు రూ.వెయ్యి చొప్పున పింఛన్లు పంపిణీ చేశారని.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పింఛను రూ.రెండు వేలకు పెంచారని గుర్తు చేశారు.

తాము దశలవారీగా పింఛన్ సొమ్ము పెంచి పంపిణీ చేపడతామని చెబుతున్నా వినకుండా అదే విషయంపై పదే పదే ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. జూలై 8న పింఛను సొమ్ము 2, 250 నుంచి రూ.2, 500కు పెంచుతామని, 2022 జూలై 8న మరో రూ. 500 పెంచి 2, 750 చేస్తామని, 2023 జూలై 8న పింఛను మొత్తాన్ని రూ. 3000 చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

కాగా ఇవాళ సభ నుంచి సస్పెండైన టీడీపీ సభ్యుల్లో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణ బాబు, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్‌ ఉన్నారు.