Telugu Global
National

ఫేస్‌బుక్‌ లో పైసలడిగితే నమ్మొద్దు

ఫేస్‌బుక్‌ ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘నా పేరుతో, నా ఫొటోని డీపీగా పెట్టుకుని ఉన్న ఈ అకౌంట్ కి, నాకూ ఏ సంబంధమూ లేదు. ఇదెవరో కావాలని మోసం చేయడం కోసమే నడిపిస్తున్న వ్యవహారంలా ఉంది. నమ్మి ఎవరూ మోసపోవద్దు. నా పేరుతో డబ్బులు అడిగితే ఎవరూ ఇవ్వొద్దు’ అంటూ వాల్ మీద చాలా మంది హెచ్చరిస్తున్నారు. సెలబ్రిటీలు, సొసైటీలో పేరున్న వాళ్ల ఫొటోలు, పేర్లతో ఈ దందా ఈ మధ్య బాగానే నడుస్తోంది. వాట్సాప్ […]

ఫేస్‌బుక్‌ లో పైసలడిగితే నమ్మొద్దు
X

ఫేస్‌బుక్‌ ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘నా పేరుతో, నా ఫొటోని డీపీగా పెట్టుకుని ఉన్న ఈ అకౌంట్ కి, నాకూ ఏ సంబంధమూ లేదు. ఇదెవరో కావాలని మోసం చేయడం కోసమే నడిపిస్తున్న వ్యవహారంలా ఉంది. నమ్మి ఎవరూ మోసపోవద్దు. నా పేరుతో డబ్బులు అడిగితే ఎవరూ ఇవ్వొద్దు’ అంటూ వాల్ మీద చాలా మంది హెచ్చరిస్తున్నారు.

సెలబ్రిటీలు, సొసైటీలో పేరున్న వాళ్ల ఫొటోలు, పేర్లతో ఈ దందా ఈ మధ్య బాగానే నడుస్తోంది. వాట్సాప్ లో కూడా ఈ దందా మూడు పువ్వులుగా ఉందని నెటిజన్లు మొత్తుకుంటున్నారు. ఇదేదో ఆరు కాయలు కాయకముందే తుంచేయాలని ఇప్పుడు పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్ ద్వారా డబ్బులు పంపించాలని వచ్చే రిక్వెస్టులు నమ్మొద్దని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీఐపీ, వీవీఐపీ మరియు సెలబ్రిటీల ఫొటోస్ పెట్టుకుని సోషల్ మీడియాలో డబ్బులు అడిగితే అది సైబర్ నేరగాళ్ల మోసమని గ్రహించి ఏ ఒక్కరు కూడా మోసపోవద్దు’ అని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో ఓ ప్రకటన పోస్ట్ చేశారు.

సెలబ్రిటీలు, అధికారులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల పేరుతో జరుగుతున్న ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించేందుకు నటుడు వేణు, ధన్రాజ్ నటించిన షార్ట్ ఫిల్మ్ని శుక్రవారం విడుదల చేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి తమకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని, తిరిగి చెల్లిస్తామని నమ్మబలికే మోసగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియాలో గుగుల్ పే, పేటీఎం, నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు పంపాలంటూ రిక్వెస్ట్ చేసినప్పుడు అనుమానం వస్తే 100 లేదా 9490617444 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటికే ఇలాంటి తలనొప్పులతో చాలా మంది తమ పేరుతో ఉన్న నకిటీ అకౌంట్లను గుర్తించి నమ్మొద్దంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా చాలా మంది మోసపోతూనే ఉన్నారు.

వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీతో పాపులర్ అయిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పేరుతో ఆయనకే ఈ మధ్య రిక్వెస్ట్ వచ్చింది. తెలుగు వారికి బాగా తెలిసిన ఓ సైకాలజీ కౌన్సెలర్ పేరుతో కూడా ఇలాగే డబ్బులు అడిగే బ్యాచ్ ఒకటి బయలెల్లిందట. ఈ సంగతి తెలిసి ఆయన ఆ అకౌంట్ కి, నాకూ ఏ సంబంధమూ లేదని ఫేస్ బుక్లో పోస్ట్ చేసిండు.

ఓ ప్రధాన తెలుగు దినపత్రికకు ఎడిటర్ గా పనిచేసిన ఓ ప్రముఖుడి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని దందా చేస్తున్న ముఠా ఒకటి లాక్ డౌన్ టైమ్ లో బాగానే దండుకునే ప్రయత్నం చేసింది. ఈ విషయం తెలిసిన ఆ మాజీ సంపాదకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ విషయంలో మోసపోకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.

  • వీవీఐపీ, వీఐపీ, సినీ ప్రముఖుల పేర్లతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్ లు వస్తే నమ్మొద్దు. సరిగా తనిఖీ చేసుకున్నాకే వారి సైన్‌ అనుకరించి ముందుకెళ్లాలి.
  • డబ్బులు అవసరమని చాట్‌ చేస్తే మాత్రం సదరు వ్యక్తికి ఫోన్‌ కాల్‌ చేసి నిజమో, కాదో నిర్ధారించుకోవాలి.
  • పిల్లలు, వృద్ధులకు వైద్య చికిత్సకు డబ్బులు అవసరం ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడిగితే ట్రాన్స్ఫర్ చేయొద్దు.
  • వీవీఐపీ, వీఐపీ, సినిమా తారలు, సెలబ్రిటీలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా డబ్బులు అడగరని గుర్తుంచుకోండి.
  • వ్యక్తిగతంగా తెలియనివారు డబ్బు అడుగుతుంటే అనుమానించాలి. అలాంటి వారి పోస్టులు, మెస్సేజ్లకు స్పందించకూడదు.
  • ఎవరైనా డబ్బు, గిఫ్ట్ కార్డులు, లోన్లు, నగదు బహుమతులు అందిస్తామని చెప్తే.. మోసం జరిగేందుకు అవకాశం ఉందని జాగ్రత్తపడాలి.
  • ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన వ్యక్తులు దరఖాస్తును తీసుకోవడానికి డబ్బు అడుగుతుంటే, వారిని అనుమానించాల్సిందే.
  • మీకు తెలిసిన వ్యక్తులు అనారోగ్యంతో ఉన్నారని, చికిత్సకు డబ్బులు కావాలని డబ్బులు అడిగితే స్పందించకూడదు. అవసరమైతే నిజంగా అనారోగ్యంతో ఉన్నవారికి ఫోన్ చేసి నజమో, కాదో తెలుసుకోవాలి.
  • ఫేస్ బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో మీకు కనిపించే పోస్టులు, మెసేజ్లకు సంబంధించిన భాష సరిగ్గా లేకపోతే అనుమానించాలి.
First Published:  11 Dec 2020 8:30 PM GMT
Next Story