Telugu Global
National

ఏలూరు ఘటనలో కారణాలు కాదు... కారకాలు కనిపెట్టారు...

ఏలూరు ఘటనలో అసలు విషయం బైటకు రాకముందే అంతా చల్లారిపోయింది. బాధితులంతా ఇళ్లకు చేరుకున్నారు, రెండురోజులపాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగి హడావిడి చేసిన ప్రతిపక్షాలు సైలెంట్ అయ్యాయి. ఆస్పత్రుల్లో వసతులపై కంగారు పడి, తమ పార్టీ తరపున డాక్టర్ల బృందాన్ని పంపించిన జనసేనాని కూడా ఆ పాయింట్ పక్కనపెట్టేశారు. ఇంతకీ ఏలూరు ఘటనలో ఏం తేల్చారు. అదిగో ఇదిగో రిపోర్ట్ లు వస్తున్నాయి, ఈరోజు అసలు విషయం చెబుతాం, కాదు కాదు రేపు ఫలానా ల్యాబ్ రిపోర్ట్ […]

ఏలూరు ఘటనలో కారణాలు కాదు... కారకాలు కనిపెట్టారు...
X

ఏలూరు ఘటనలో అసలు విషయం బైటకు రాకముందే అంతా చల్లారిపోయింది. బాధితులంతా ఇళ్లకు చేరుకున్నారు, రెండురోజులపాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగి హడావిడి చేసిన ప్రతిపక్షాలు సైలెంట్ అయ్యాయి. ఆస్పత్రుల్లో వసతులపై కంగారు పడి, తమ పార్టీ తరపున డాక్టర్ల బృందాన్ని పంపించిన జనసేనాని కూడా ఆ పాయింట్ పక్కనపెట్టేశారు.

ఇంతకీ ఏలూరు ఘటనలో ఏం తేల్చారు. అదిగో ఇదిగో రిపోర్ట్ లు వస్తున్నాయి, ఈరోజు అసలు విషయం చెబుతాం, కాదు కాదు రేపు ఫలానా ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది అంటూ చెప్పుకొచ్చిన అధికారులు కూడా సరైన కారణం చెప్పకుండానే మమ అనిపించేశారు. కారణం చెప్పలేదు కానీ, కారకాలు మాత్రం కనిపెట్టేశారు. ఏలూరులో ప్రజల అస్వస్థతకు పురుగు మందుల అవశేషాలే కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఏలూరు ఘటనపై సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో ఢిల్లీ ఎయిమ్స్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్ (హైదరాబాద్), నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ ‌(హైదరాబాద్), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (పుణె) సహా మరికొన్ని పరిశోధనా సంస్థలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. పురుగు మందుల అవశేషాలు బాధితుల శరీరంలో కనిపించాయని, వివిధ పరీక్షల ద్వారా ఈ విషయం నిర్థారణ అయిందని తేల్చి చెప్పారు.

అయితే బాధితుల శరీరాల్లో కనిపించిన పురుగు మందుల అవశేషాలు.. లోపలికి ఎలా వెళ్లాయనేది మాత్రం చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. నీటి ద్వారానా, లేక ఆహార పదార్ధాల ద్వారానా, పాలు, పండ్లు.. వీటిలో దేని ద్వారా బాధితుల శరీరాల్లోకి పురుగు మందుల అవశేషాలు వెళ్లాయనేది అంతు చిక్కకుండా మారింది. దీనికి దీర్ఘకాలిక పరిశోధన ఒక్కటే మార్గం అని తేల్చి చెప్పడంతో.. ఆ దిశగా పరిశోధనలు సాగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఢిల్లీ ఎయిమ్స్‌, ఎన్‌ఐసీటీకి ఈ పరిశోధన బాధ్యతలు అప్పగించారు. ఏలూరులో క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని.. ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని సీఎం సూచించారు. ఫలితాల ఆధారంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, దానికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరారు సీఎం.

మొత్తమ్మీద ఏలూరులో అసలు సమస్య దేని వల్ల వచ్చిందనే విషయాన్ని ఏ పరిశోధనా సంస్థ కూడా బైట పెట్టలేకపోవడం విశేషం. పురుగు మందుల అవశేషాలు అని ముక్త కంఠంతో చెబుతున్నారే కానీ, అవి ఎలా ప్రజల శరీరాల్లోకి చేరాయనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు. ఇంతకీ ఏలూరు ఘటనకి అసలు కారణం ఏంటి అంటే.. పురుగు మందుల ప్రభావం అని చెప్పుకోవాలనమాట. అంతకు మించి ఏదైనా ఆశిస్తే.. అది పరిశోధనల తర్వాతే తెలుస్తుంది. ఆ పరిశోధనల ముగింపు నాటికి ఏలూరు ఘటనని స్థానికులే పూర్తిగా మరచిపోయే అవకాశం ఉంది.

First Published:  16 Dec 2020 8:38 PM GMT
Next Story