Telugu Global
National

మమత రాజ్యంలో చాపకింద నీరులా ఎంఐఎం...

ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. దాంతోపాటే.. ఏ అంచనాలూ లేకుండా ఎంఐఎం ఏకంగా 5 స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించింది. బీహార్ లో బీజేపీ పాశుపతాస్త్రంగా భావించిన ఎల్జేపీ 134 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క స్థానంలో గెలవగా.. ఎలాంటి అంచనాలు లేని ఎంఐఎం కేవలం 20 స్థానాల్లో పోటీ చేసి ఐదింట విజయ దుందుభి మోగించింది. బీహార్ లో ఎంఐఎం గెలుపొందిన స్థానాలన్నీ సీమాంచల్ లోవే. ఆ […]

మమత రాజ్యంలో చాపకింద నీరులా ఎంఐఎం...
X

ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. దాంతోపాటే.. ఏ అంచనాలూ లేకుండా ఎంఐఎం ఏకంగా 5 స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించింది. బీహార్ లో బీజేపీ పాశుపతాస్త్రంగా భావించిన ఎల్జేపీ 134 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క స్థానంలో గెలవగా.. ఎలాంటి అంచనాలు లేని ఎంఐఎం కేవలం 20 స్థానాల్లో పోటీ చేసి ఐదింట విజయ దుందుభి మోగించింది.

బీహార్ లో ఎంఐఎం గెలుపొందిన స్థానాలన్నీ సీమాంచల్ లోవే. ఆ ప్రాంతం పశ్చిమబెంగాల్ కు సరిహద్దు కూడా. అదే ఊపులో బోర్డర్ క్రాస్ చేసి వెస్ట్ బెంగాల్ లో కూడా తమ సత్తా చాటాలనుకుంటున్నారు మజ్లిస్ నాయకులు.

ఇప్పటి వరకూ వెస్ట్ బెంగాల్ లో మజ్లిస్ కనీసం పోటీ కూడా చేయలేదు. కానీ తొలిసారి ఆ పార్టీ బెంగాల్ లో కాలుమోపుతోందనే వార్తలు ఏకంగా సీఎం మమతా బెనర్జీని సైతం కలవరపెట్టాయి. అందుకే ఆమె బీజేపీని, మజ్లిస్ ని ఒకే గాటన కడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మైనారిటీ ఓట్లను చీల్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ పార్టీకి బీజేపీ డబ్బులు ఇస్తోందని మమత ఆరోపించారు.

ఓటర్ల మధ్య మతపరమైన విభజన తీసుకొచ్చేందుకు అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్‌ పార్టీని రాష్ట్రానికి దిగుమతి చేయబోతోందని, ఇందు కోసం కోట్ల రూపాయలను బీజేపీ వెచ్చిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఇప్పటి వరకూ ఒక సీటు కూడా లేని పార్టీ, ఒకసారి కూడా బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీని చూసి మమత అంతగా కంగారు పడటంతో సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నారు.

మరోవైపు మమతాకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. తమను డబ్బుతో కొనేవారు ఇప్పటివరకు ఎవరూ పుట్టలేదని బదులిచ్చారు. మైనారిటీ ఓటర్లు తృణమూల్ జాగీర్‌ కాదని, మైనారిటీల శ్రేయస్సుకోసం ఆలోచించి, మాట్లాడే వారిని మమత ఇష్టపడరని అన్నారు.

బీజేపీకి మజ్లిస్ తో లోపాయికారీ ఒప్పందం ఉందా లేదా అనే విషయం పక్కనపెడితే.. ఎంఐఎం ఎంట్రీతో తృణమూల్ కంగారుపడుతుందనే మాట మాత్రం వాస్తవం. మెల్లగా ఒక్కో రాష్ట్రంలో ఎంట్రీ ఇస్తూ, తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది ఎంఐఎం. వెస్ట్ బెంగాల్ లో చాపకింద నీరులా ప్రవేశిస్తోంది.

First Published:  16 Dec 2020 8:41 PM GMT
Next Story