Telugu Global
National

ఉద్యోగం వదిలి రైతు ఉద్యమంలోకి

చుట్టూ చీకట్లు అలుముకుంటున్నప్పుడు ఏమీ పట్టన్నట్లు కూర్చోవడం అవివేకమే. కోట్లాది మంది రైతులు కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రోజుల తరబడి ఆందోళన చేస్తుంటే కొందరికి చీమకుట్టినట్లయినా అనిపించడం లేదు. అన్నం పెట్టే రైతు ఎముకలు కొరికే చలిలో మృత్యువును సవాల్ చేస్తుంటే చలనం లేని మనుషులు చాలా మంది రొటీన్ జీవితాల్లో మునిగిపోయి ఉన్నాయి. కానీ కొందరుంటారు ఎవరు దు:ఖపడ్డా చలించిపోతారు. దు:ఖానికి కారణాలను అన్వేషిస్తారు. పరిష్కారాల కోసం తపనపడతారు. […]

ఉద్యోగం వదిలి రైతు ఉద్యమంలోకి
X

చుట్టూ చీకట్లు అలుముకుంటున్నప్పుడు ఏమీ పట్టన్నట్లు కూర్చోవడం అవివేకమే. కోట్లాది మంది రైతులు కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ దేశ రాజధాని
సరిహద్దుల్లో రోజుల తరబడి ఆందోళన చేస్తుంటే కొందరికి చీమకుట్టినట్లయినా అనిపించడం లేదు. అన్నం పెట్టే రైతు ఎముకలు కొరికే చలిలో మృత్యువును సవాల్ చేస్తుంటే
చలనం లేని మనుషులు చాలా మంది రొటీన్ జీవితాల్లో మునిగిపోయి ఉన్నాయి. కానీ కొందరుంటారు ఎవరు దు:ఖపడ్డా చలించిపోతారు. దు:ఖానికి కారణాలను అన్వేషిస్తారు. పరిష్కారాల కోసం తపనపడతారు. అలాంటి కోట్లాది మంది ఇప్పుడు భారతదేశ రైతు ఉద్యమానికి అండగా నిలుస్తున్నారు. వారిలో ఒకరు ముప్పై ఏళ్ల హైదరాబాదీ యువకుడు మనోజ్.

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం దాదాపు నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు ఆందోళనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. దేశ నలుమూలల నుంచీ రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు భారీ సంఖ్యలో ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చి చేరుతున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ హిమాయత్ నగర్ వాసి ఎం. మనోజ్ ఒకరు. అతడు ఏ సంస్థకో, ఏ రాజకీయ పార్టీకో చెందిన వ్యక్తి కాదు. అయినా… రైతు ఉద్యమంలో భాగమయ్యాడు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఏ బ్యానర్లు, ప్లెకార్డులు, జెండాలు లేకుండా ఏ గుర్తింపునూ ఆశించకుండా రైతు ఆందోళనలో భాగమయ్యాడు.

ఆస్ట్రేలియాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన మనోజ్ ప్రజలతో కలిసి పనిచేయడం కోసం తన ఉద్యోగాన్ని వదిలేశాడు. ఉద్యోగం వదిలి రైతు ఆందోళనలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి తాను పనిచేసిన సంస్థకు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేకపోయినా ఆందోళనల్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసేదని అభిప్రాయపడుతున్న మనోజ్ ఉద్యోగం కంటే ప్రత్యక్షంగా రైతు ఆందోళనలో భాగమవ్వడానికి తాను ప్రాధాన్యతనిస్తానంటున్నాడు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గురు తెగ్ బహదూర్ మెమోరియల్ సమీపంలోని రైతు ఆందోళనా స్థలానికి చేరుకున్న మనోజ్… దాదాపు 25 కిలో మీటర్లు ఆందోళనా ప్రాంతంలో తిరిగారు. రైతులకు సంఘీభావంగా నిరాహార దీక్షను ఆరంభించారు.

మనోజ్ కుటుంబ సభ్యులు మనోజ్ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. మనోజ్ సోదరుడు డాక్టర్. మనోజ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఎక్కువ రోజులు నిరాహార దీక్షలో ఉంటే ఆరోగ్యం పాడవుతుందని మూడు రోజులకు మించి నిరాహార దీక్ష కొనసాగించవద్దని సూచించాడు. కానీ మనోజ్ మాత్రం 15 రోజుల వరకూ తన నిరాహార దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకూ… మనోజ్ ను ఎందుకు రైతు ఆందోళన కదలించింది. రైతు ఉద్యమం పట్ల ఎందుకంత సానుకూలంగా ఉన్నారు? ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని రావల్సిన అవసరం ఏమొచ్చింది?

నిజానికి మనోజ్ కుటుంబం వ్యవసాయాధారిత కుటుంబమేమీ కాదు. హైదరాబాద్ లో తనచుట్టూ ఉన్న వాళ్లు కానీ, మీడియా కానీ రైతు ఉద్యమం పట్ల పెద్దగా పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నాయి కూడా. కానీ తన తండ్రి మండీల నుంచి కూరగాయలు కొనుగోలు చేసి ఎగుమతి చేస్తుంటారు. అలా తనకు పరోక్షంగా వ్యవసాయంతో సంబంధం ఉంది. అంతకు మించి… నూతన వ్యవసాయ చట్టాల వల్ల జరిగే నష్టం పట్ల మనోజ్ కు అవగాహన ఉంది. అందుకే రైతులు వ్యవసాయం చేయడం మానేస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని అంటున్నాడు మనోజ్.

“ఇప్పటికిప్పుడు నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం కనిపించకపోవచ్చు, కానీ కొద్ది కాలంలోనే ఆ ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతుంది. పంజాబ్, హర్యానా రైతులు వ్యవసాయానికి దూరమైతే, దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధర విపరీతంగా పెరిగిపోతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో పాటు, సామాన్యులందరిపై ఆ ప్రభావం ఉంటుంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతాయి. అందుకే ఇది కేవలం రైతు ఉద్యమం మాత్రమే కాదు.. దేశ ప్రజలందరి ఉద్యమం” అంటున్నాడు మనోజ్.

First Published:  22 Dec 2020 1:59 AM GMT
Next Story