Telugu Global
National

పొత్తులపై కమల్ ఎత్తులు... కాంగ్రెస్ కు వల

తమిళనాట మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ అన్ని పార్టీల కంటే ముందే జోరుగా ప్రచారం చేస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు సాధించిన కమల్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటింగ్ శాతం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేసేంత బలం లేకపోవడంతో మక్కల్ నీది మయ్యం పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాట ఇప్పటివరకు అన్నా డీఎంకే, డీఎంకే […]

పొత్తులపై కమల్ ఎత్తులు... కాంగ్రెస్ కు వల
X

తమిళనాట మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ అన్ని పార్టీల కంటే ముందే జోరుగా ప్రచారం చేస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు సాధించిన కమల్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటింగ్ శాతం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేసేంత బలం లేకపోవడంతో మక్కల్ నీది మయ్యం పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాట ఇప్పటివరకు అన్నా డీఎంకే, డీఎంకే కూటములు మాత్రమే ప్రధానంగా ఎన్నికల బరిలో దిగుతుండగా.. ఈసారి మాత్రం తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కమల్ హాసన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ వైపు చూడక పోతే రజనీతో కలసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ఇప్పటికే కమల్ హాసన్ ప్రకటించారు. అయితే రజనీ నుంచి ఇంకా ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో కమల్ హాసన్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తమిళనాట డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఎన్నో ఏళ్లుగా కలసి పోటీ చేస్తున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అన్నాడీఎంకే చేతిలో స్వల్ప సీట్ల తేడాతో ఓటమి చెందింది. అయితే అందుకు కారణం కాంగ్రెసేనన్న విమర్శలు ఉన్నాయి.

గత ఎన్నికల సమయంలో డీఎంకే కాంగ్రెస్ కు 40 సీట్లు కేటాయించగా.. ఆ పార్టీ కేవలం ఎనిమిది చోట్ల మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ పరాజయం కారణంగానే డీఎంకే విజయానికి దగ్గరి వరకు వచ్చి ఓటమి చెందింది. అప్పట్లో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇవ్వకపోయిఉంటే డీఎంకే గెలిచి ఉండేదనే వ్యాఖ్యలు వినిపించాయి.

ప్రస్తుతం తమిళనాట డీఎంకే కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు కేటాయించి తప్పు చేశామని, ఈసారి ఆ పార్టీ బలాన్ని బట్టి ఇరవై సీట్ల కంటే ఎక్కువ ఇవ్వకూడదని స్టాలిన్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ డీఎంకే కూటమి లో కోరినన్ని సీట్లు లభించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ కూటమికి గుడ్ బై చెబితే కాంగ్రెస్ ను మక్కల్ నీది మయ్యం కూటమిలో కి స్వాగతం పలికేందుకు కమల్ హాసన్ సిద్ధమవుతున్నారు. ఈ విషయానికి సంబంధించి ఆ పార్టీ నేత ఒకరు మాట్లాడుతూ తమ అధినేత కమల్ తో కాంగ్రెస్ జాతీయ నాయకులు టచ్ లో ఉన్నారని, డీఎంకే కూటమిలో తక్కువ సీట్లు గనుక ఇస్తే ఆ పార్టీ కూటమి నుంచి వైదొలగడం ఖాయమని చెప్పారు.

కాగా, మక్కల్ నీది మయ్యం పార్టీతో పొత్తు ఉంటుందని వస్తున్న వార్తలపై తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దినేష్ గుండూరావు తీవ్రంగా ఖండించారు. డీఎంకే తొలి నుంచి తమకు మిత్రపక్షమని ఎట్టి పరిస్థితుల్లో కూటమిని వీడేది లేదని స్పష్టం చేశారు. డీఎంకే తో కలిసి ఎన్నికలను ఎదుర్కోనున్నట్లు ఆయన ప్రకటించారు.

First Published:  23 Dec 2020 4:07 AM GMT
Next Story