Telugu Global
National

ఊరించి ఉసూరుమనిపించిన ప్రధాని మోదీ...

ప్రధాని మోదీ వర్చువల్ సమావేశంతో రైతులు ఆందోళన విరమిస్తారని, వారికి కచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తారని అందరూ ఆశించారు. ఇప్పటి వరకూ కేంద్ర మంత్రులే రైతు నేతలతో నేరుగా సమావేశం కావడం, ప్రధాని 25వతేదీ సమావేశంపై వారం ముందే హింట్ ఇవ్వడంతో.. ఆరోజు అంతా సెట్ రైట్ అవుతుందని అనుకున్నారు. తీరా మోదీ ప్రసంగంలో రైతుల అపోహలు తొలగించే మాటలేవీ లేవు, కనీసం వారికి ఊరటనిచ్చే అంశాలు కూడా కనపడలేదు. ఫక్తు రాజకీయ నాయకుడిలాగా… విపక్షాలపై ధ్వజమెత్తి, […]

ఊరించి ఉసూరుమనిపించిన ప్రధాని మోదీ...
X

ప్రధాని మోదీ వర్చువల్ సమావేశంతో రైతులు ఆందోళన విరమిస్తారని, వారికి కచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తారని అందరూ ఆశించారు. ఇప్పటి వరకూ కేంద్ర మంత్రులే రైతు నేతలతో నేరుగా సమావేశం కావడం, ప్రధాని 25వతేదీ సమావేశంపై వారం ముందే హింట్ ఇవ్వడంతో.. ఆరోజు అంతా సెట్ రైట్ అవుతుందని అనుకున్నారు.

తీరా మోదీ ప్రసంగంలో రైతుల అపోహలు తొలగించే మాటలేవీ లేవు, కనీసం వారికి ఊరటనిచ్చే అంశాలు కూడా కనపడలేదు. ఫక్తు రాజకీయ నాయకుడిలాగా… విపక్షాలపై ధ్వజమెత్తి, ఉద్యమ పాపమంతా ప్రతిపక్షాలదేననే నిందవేసి వెళ్లిపోయారు మోదీ. దీంతో రైతు ఆందోళనపై తిరిగి ప్రతిష్టంభన మొదలైంది. ప్రధాని కూడా సరైన హామీ ఇవ్వకపోవడంతో రైతుల ఆందోళన ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.

వాజ్ ‌పేయి జయంతి సందర్భంగా దేశంలోని 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.2వేల చొప్పున మొత్తం రూ.18వేల కోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధులను విడుదల చేశామన్నారు మోదీ. పలు రాష్ట్రాల రైతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కొత్త సాగు చట్టాలు చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తాయని మరోసారి చెప్పుకొచ్చారాయన. దేశంలోని అత్యధిక మంది రైతులు వీటిని సమర్థిస్తున్నారని తెలిపిన మోదీ.. కొంతమందిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడించారు. ముందుగా ట్రైనింగ్ ఇప్పించి మరీ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఓ పండగలా సాగింది.

రైతులకు వ్యవసాయ చట్టాలపై ప్రధాని మరింత స్పష్టత ఇస్తారనుకోవడం అత్యాశే అయింది. ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయడానికే ఆయన తన ప్రసంగాన్ని ఉపయోగించుకున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి.. పశ్చిమబెంగాల్ లోని 70లక్షలమంది రైతులకు అందకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకున్నారని మండిపడ్డారు మోదీ. ఎన్నికల్లో ఓడిపోయినవారు కూడా తనపై విమర్శలు చేస్తున్నారంటూ పరోక్షంగా రాహుల్ గాంధీపై చెణుకులు విసిరారు.

ఇక రైతు ఉద్యమాన్ని కూడా ప్రతిపక్షాల కుట్రేనంటూ తేల్చి పారేశారు మోదీ. రైతులు ఆందోళన ప్రారంభించినప్పుడు మద్దతు ధర అంశమే వారి ప్రధాన డిమాండ్ ‌గా ఉండేదని, రాజకీయ శక్తులు ఉద్యమంలో ప్రవేశించిన తర్వాత ఇతర డిమాండ్లు తెరపైకి వచ్చాయని ఆరోపించారు.

మొత్తమ్మీద.. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత రైతులు కాస్త మెత్తబడతారన్న అంచనాలు తలకిందులయ్యాయి. మోదీ మాటలతో వారిలో మరింత కసి పెరిగేలా ఉంది. రైతు ఆందోళనలకు సాగు చట్టాలు కారణం కాదని, పూర్తిగా ప్రతిపక్షాలదే బాధ్యత అంటూ ప్రధాని తేల్చేయడంతో.. ఈ సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

First Published:  25 Dec 2020 9:41 PM GMT
Next Story