Telugu Global
National

బీజేపీ గేమ్‌ నుంచి బయటపడ్డ రజినీ

ఇద్దరు మహా నేతల మహాభినిష్క్రమణం తర్వాత తొలిసారి జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై చాలామందికి చాలా రకాల ఆశలున్నాయి. నాయకత్వ లేమితో సతమతమవుతున్న అన్నాడీఎంకేపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు పన్నీర్ సెల్వం, పళనిస్వామి. నెచ్చెలి పరోక్షంలో తానే తలైవిగా మారాలని ఆశపడుతున్నారు శశికళ. తండ్రి వారసుడిగా తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు డీఎంకే అధినేత స్టాలిన్. కమల్ హాసన్ లో కాలం కలిసొస్తుందేమోనన్న చిన్న ఆశ ఉంది. రాగా పోగా తమిళనాడులో తమ […]

బీజేపీ గేమ్‌ నుంచి బయటపడ్డ రజినీ
X

ఇద్దరు మహా నేతల మహాభినిష్క్రమణం తర్వాత తొలిసారి జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై చాలామందికి చాలా రకాల ఆశలున్నాయి. నాయకత్వ లేమితో సతమతమవుతున్న అన్నాడీఎంకేపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు పన్నీర్ సెల్వం, పళనిస్వామి. నెచ్చెలి పరోక్షంలో తానే తలైవిగా మారాలని ఆశపడుతున్నారు శశికళ.

తండ్రి వారసుడిగా తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు డీఎంకే అధినేత స్టాలిన్. కమల్ హాసన్ లో కాలం కలిసొస్తుందేమోనన్న చిన్న ఆశ ఉంది. రాగా పోగా తమిళనాడులో తమ సత్తా చూపించాలని కమలదళం కూడా ఆరాటపడుతోంది. నిన్న మొన్నటి వరకూ రేసులో ఉన్న రజినీకాంత్ అకస్మాత్తుగా వెనకడుగేయడంతో వీరందరిలో కొత్త ఆశలు చిగురించాయి. పోటీ నుంచి ఒకరు తప్పుకోవడం మిగతావారికి కచ్చితంగా సంతోషాన్నిచ్చే వార్తే, అయితే బీజేపీలో మాత్రం అంతర్మథనం మొదలైంది.

వాస్తవానికి తమిళనాడులో ఇప్పటి వరకూ బీజేపీ ఒక్క సారి కూడా అసెంబ్లీ మెట్లెక్కలేదు. అధికారం ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే దోబూచులాడేది, కనీసం సంకీర్ణానికి కూడా అవకాశం లేకుండా ప్రజలు కచ్చితమైన తీర్పునిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో వీలైనంత ఎక్కువ మందిని పోటీకి ప్రేరేపించి సంకీర్ణ సర్కారుకి బాటలు వేయాలనేది బీజేపీ ఆలోచన. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమిళనాడుని కుక్కలు చింపిన విస్తరి చేయాలని, సందడ్లో సడేమియాలాగా వారిపై తాము పెత్తనం చెలాయించాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచన.

అందుకే రజినీ పొలిటికల్ ఎంట్రీని పరోక్షంగా బీజేపీ ప్రోత్సహించింది. రజినీపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసేవారు బీజేపీ నేతలు. రజినీ పుట్టినరోజున ఊరందరికంటే ముందు ప్రధాని మోదీ ట్వీట్ వేయడానికి కూడా కారణం ఇదే. వీలైతే రజినీని కూడా అన్నా డీఎంకే, బీజేపీ కూటమిలో కలుపుకోవాలని, లోకపోతే.. రజినీ పార్టీతో కొత్తగా కూటమి కట్టాలనేది బీజేపీ ఆలోచన.

అన్నాడీఎంకే, డీఎంకే వంటి బలమైన పార్టీలను బలహీనం చేయాలంటే రజినీ పార్టీని రంగంలోకి దింపి ఓట్లను చీల్చాలనేది బీజేపీ దూరాలోచన. కానీ రజినీ వెనకడుగు వేయడంతో బీజేపీ ఆలోచనలో పడింది. మరోవైపు రజినీని రంగంలోకి దిగకుండా బీజేపీ పెద్దలు ఒత్తిడి చేశారనే ప్రచారం కూడా తమిళనాడులో జోరుగా సాగుతోంది. సర్వేల ఆధారంగా తనకు సత్తా లేదని తేలడంతో రజినీ తనకు తానే వెనక్కు తగ్గారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

జయలలిత మరణం తర్వాత తమిళనాడుపై పట్టు బిగించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది బీజేపీ. ముఖ్యమంత్రి కావాలన్నశశికళ కలను కూడా చెరిపేసింది ఆ పార్టీయేనని అంటారు. ఇప్పుడు ఏ దిక్కూలేని అన్నా డీఎంకేని, పొత్తు పేరుతో తమ గుప్పెట్లో పెట్టుకోవాలనేది ఆ పార్టీ ఆశ.

అయితే బీజేపీ కబంధ హస్తాల ప్రభావాన్ని కాస్త ముందుగానే గుర్తించిన అన్నా డీఎంకే నేతలు కాస్త దూరం జరిగారు. పొత్తు పేరుతో పెత్తనం చలాయిస్తే కుదరదని ముందుగానే ఖరాఖండిగా చెప్పేశారు. ఇటు రజినీ వెనకడుగు వేయడం, అటు అన్నా డీఎంకే ముందు జాగ్రత్త పడటంతో బీజేపీ నేతలు మరో ఎత్తుగడకోసం వేచి చూస్తున్నారు.

మొత్తమ్మీద రజినీ వెనక్కు తగ్గడంతో పరోక్షంగా డీఎంకే, అన్నాడీఎంకే లాభపడతాయని, తమిళనాడు రాజకీయాల్లో పట్టు బిగించాలని చూస్తున్న బీజేపీకి ఇది నష్టం చేకూర్చే అంశమేనని అంటున్నారు.

First Published:  30 Dec 2020 2:18 AM GMT
Next Story