Telugu Global
National

లవ్ జీహాద్ పై యుద్ధం.. మూర్ఖత్వమే " యూపీ సీఎంకు మాజీ అధికారుల లేఖ

మేథావుల మౌనం కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరం. అందుకే ఆ మౌనాన్ని వీడారు, ఏకంగా ముఖ్యమంత్రికి కర్తవ్యం బోధిస్తూ లేఖ రాశారు ఉత్తర ప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు. ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన 104 మంది కూడబలుక్కుని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. లవ్ జీహాద్ పై జరుగుతున్న యుద్ధంలో వెనక్కు తగ్గాల్సిందేనని హితబోధ చేశారు. బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో రాష్ట్రంలో తీవ్ర […]

లవ్ జీహాద్ పై యుద్ధం.. మూర్ఖత్వమే  యూపీ సీఎంకు మాజీ అధికారుల లేఖ
X

మేథావుల మౌనం కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరం. అందుకే ఆ మౌనాన్ని వీడారు, ఏకంగా ముఖ్యమంత్రికి కర్తవ్యం బోధిస్తూ లేఖ రాశారు ఉత్తర ప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు. ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన 104 మంది కూడబలుక్కుని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. లవ్ జీహాద్ పై జరుగుతున్న యుద్ధంలో వెనక్కు తగ్గాల్సిందేనని హితబోధ చేశారు.

బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో రాష్ట్రంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, సామాన్యులు సైతం వేధింపులకు గురవుతున్నారంటూ వాస్తవాలు కళ్లకు కట్టారు. వెంటనే ఆ ఆర్డినెన్స్ రద్దు చేయాలని కోరారు.

శివశంకర్ మీనన్, వాజత్ హబీబుల్లా, టీకేఏ నాయర్.. వంటి రిటైర్డ్ అదికారులు ఈ లేఖను రాశారు. దీని వెనక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, కేవలం రాష్ట్రానికి చెడ్డపేరు రాకూడదని, ఈ ఆర్డినెన్స్ తో వచ్చే దుష్పరిణామాలను అడ్డుకునే ఉద్దేశంతోటే లేఖ రాశామని స్పష్టం చేశారు.

అసలేంటీ లవ్ జీహాద్..

ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది యువకులు.. హిందూ వర్గానికి చెందిన యువతులను మోసగించి పెళ్లి చేసుకుని, ఆ తర్వాత మత మార్పిడికి పాల్పడుతున్నారని, హిందూ యువతులు ప్రేమ పేరుతో ఇలా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారనే వాదన కొన్నాళ్లుగా ఉత్తరాదిలో వినిపిస్తోంది. దీనికి లవ్ జీహాద్ అనే పేరు కూడా పెట్టారు.

ఈ లవ్ జీహాదీని అడ్డుకునేందుకు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకొస్తున్నాయి. బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు ముందుగా యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం బలవంతపు మతమార్పిడికి పాల్పడినట్లు తేలితే అలా మత మార్పిడికి ప్రోత్సహించినవారికి ఏడాదినుంచి ఐదు ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. జైలు శిక్షతో పాటుగా రూ.15 వేల జరిమానా కూడా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళలు, మైనార్టీలు మతమార్పిడికి పాల్పడితే మూడు నుంచి పదేళ్ల పాటు జైలుశిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తారు. లవ్ జీహాద్ ‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ కి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూపకర్త అని చెబుతారు. అందుకే నేరుగా ముఖ్యమంత్రికి లేఖను రాశారు మాజీ అధికారులు.

లవ్ జీహాద్ కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వల్ల ఎదురవుతున్న దుష్ఫలితాలను యోగీకి రాసిన లేఖలో కళ్లకు కట్టారు. మొరాదాబాద్ ఘటనను కూడా వారు ప్రస్తావించారు. ఐదు నెలల క్రితం రషీద్ అనే యువకుడు ఓ హిందూ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత భజరంగ్ దళ్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రషీద్ ని జైలుకి తరలించి, అతని భార్యను జువైనల్ హోమ్ లో పెట్టారు. భార్యా భర్తలిద్దర్నీ విడగొట్టడం వల్ల, గర్భవతియైన భార్యకు సరైన వైద్య చికిత్స అందక అబార్షన్ జరిగింది. ఈ పాపానికి కారణం ఈ ఆర్డినెన్సేని, ఇలాంటి వాటి వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని స్పష్టం చేశారు.

ఒకప్పుడు గంగ, యమునా నదీ పరివాహక ప్రాంత నాగరికతతో పరిఢవిల్లిన ఉత్తర ప్రదేశ్.. ఇప్పుడు ఇలాంటి అనాలోచిత ఆర్డినెన్స్ ల వల్ల మూర్ఖత్వానికి పరాకాష్టగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. లవ్ జీహాద్ అంతం పేరుతో యూపీలో హేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అన్నారు. వెంటనే ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

First Published:  30 Dec 2020 1:40 AM GMT
Next Story