Telugu Global
National

కేసీఆర్ లాజిక్ ఏంటి..? కేంద్రంతో సఖ్యత దేనికి సంకేతం..??

దుబ్బాక పరాభవం, ఆ వెంటనే జీహెచ్ఎంసీ ఫలితంతో కేసీఆర్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే ఉప ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. జమిలి ఎన్నికలను తలచుకునే ఆయన కాస్త హడావిడి పడుతున్నట్టు అర్థమవుతోంది. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన రోజుల వ్యవధిలోనే.. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ జీతాలు పెంచడం విశేషమేనని చెప్పాలి. ఆఖరికి ప్రభుత్వంతో సంబంధంలేని ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెంచేసి, కార్పొరేషన్ వద్ద నిధులు లేకపోతే.. ప్రభుత్వం నుంచి సర్దుబాటు […]

కేసీఆర్ లాజిక్ ఏంటి..? కేంద్రంతో సఖ్యత దేనికి సంకేతం..??
X

దుబ్బాక పరాభవం, ఆ వెంటనే జీహెచ్ఎంసీ ఫలితంతో కేసీఆర్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే ఉప ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. జమిలి ఎన్నికలను తలచుకునే ఆయన కాస్త హడావిడి పడుతున్నట్టు అర్థమవుతోంది. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన రోజుల వ్యవధిలోనే.. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ జీతాలు పెంచడం విశేషమేనని చెప్పాలి.

ఆఖరికి ప్రభుత్వంతో సంబంధంలేని ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెంచేసి, కార్పొరేషన్ వద్ద నిధులు లేకపోతే.. ప్రభుత్వం నుంచి సర్దుబాటు చేస్తానని చెప్పడం కేసీఆర్ వ్యవహార శైలికి కాస్త భిన్నంగా తోచింది. అంతే కాదు.. అప్పటి వరకూ కేంద్రంతో ఉప్పు, నిప్పుగా ఉన్న తెలంగాణ సీఎం.. రైతుల నుంచి పంట కొనుగోళ్లపై వెనక్కు తగ్గడం, బహిరంగ మార్గెట్ లోకి రైతుల్ని అనుమతించి కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను పరోక్షంగా సమర్థించడం చూస్తుంటే కేసీఆర్ ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు మరింత స్పష్టమైంది.

రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా భారత్ బంద్ లో ప్రధాన భూమిక పోషించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజుల వ్యవధిలో ఇలా మారిపోతారని ఎవరూ అనుకోలేదు. ఇక ఈ ఏడాది కేసీఆర్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ చూస్తే ఆయన ఢిల్లీ పర్యటనలో ఏసలు ఏం జరిగిందా అనే అనుమానాలు రాకమానవు. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయుష్మాన్ భారత్ అమలుకి దారులు తెలిచారు.

ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు గురించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని జోడించడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణ ఆరోగ్యశ్రీ వంద రెట్లు మేలని చెప్పిన కేసీఆర్.. సడన్ గా కేంద్ర పథకానికి మద్దతుగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఢిల్లీ పర్యటనలో ఏమైంది.. ?

ఆమధ్య తెలంగాణ ఉప ఎన్నికల సందర్భంగా.. నా బంగారు తెలంగాణలో వేలు పెడితే ఢిల్లీతో అమీ తుమీ తేల్చుకుంటానని సవాల్ విసిరారు కేసీఆర్. హైదరాబాద్ కేంద్రంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి, మోదీపై యుద్ధానికి సిద్ధం చేస్తానంటూ హెచ్చరించారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాలతో కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని సామరస్యంగా అడిగి వచ్చారు. ఇక తిరిగొచ్చాక, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నేతలను ఆలోచనలో పడేస్తున్నాయి. కేంద్రంతో సఖ్యత కోరుకుంటున్నారా, లేక మరీ సాగిల పడ్డారా అని అనుమానించేలా ఆయన వ్యవహార శైలి ఉంది. ఏది ఏమయినా.. జమిలి ఎన్నికలు ముంచుకొస్తాయన్న సంకేతాలు వెలువడటంతో.. మొండిగా వెళ్లడం కంటే, కాస్త ముందు చూపుతో వెళ్లడం మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. నేరుగా బీజేపీతో ఫైట్ చేసి, ప్రత్యర్థిని పెద్దోడిని చేయడం కంటే.. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, ఇతర పార్టీల కలగూర గంపతో బలహీన ప్రతిపక్షాలను తయారు చేసుకోవడమే కేసీఆర్ తక్షణ కర్తవ్యం. ఆ దిశగానే ఆయన అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది.

First Published:  30 Dec 2020 11:06 PM GMT
Next Story