Telugu Global
National

బీజేపీ నోట సెక్యులర్ పాట

బీజేపీ అధికారంలో ఉన్న ప్రతిచోటా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. కేంద్రంలోనే కాదు రాష్ట్రాల్లోనూ ఊహించని సంస్కరణలకు తెరతీస్తోంది. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను ఏమాత్రం లెక్క చేయకుండా దూకుడును ప్రదర్శిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సరవణ చట్టం విషయంలో కేంద్రం ప్రదర్శించిన మొండి వైఖరినే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా స్వీకరిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు లవ్ జిహాద్ పేరుతో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చాయి. ఇప్పుడు అసోం అసెంబ్లీ సైతం మరో […]

బీజేపీ నోట సెక్యులర్ పాట
X

బీజేపీ అధికారంలో ఉన్న ప్రతిచోటా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. కేంద్రంలోనే కాదు రాష్ట్రాల్లోనూ ఊహించని సంస్కరణలకు తెరతీస్తోంది. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను ఏమాత్రం లెక్క చేయకుండా దూకుడును ప్రదర్శిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సరవణ చట్టం విషయంలో కేంద్రం ప్రదర్శించిన మొండి వైఖరినే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా స్వీకరిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు లవ్ జిహాద్ పేరుతో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చాయి. ఇప్పుడు అసోం అసెంబ్లీ సైతం మరో వివాదస్పద బిల్లుకు ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మదర్సాలను రద్ద చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా ధనంతో మత సంబంధ విద్యను అందించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన మదర్సాల రద్దు బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. బిల్లులో ది అసోం మదర్సా ఎడ్యుకేషన్ (ప్రాంతీయీకరణ) చట్టం-1995’, ది అసోం మదర్సా ఎడ్యుకేషన్ చట్టం(ఉద్యోగుల సేవల ప్రాంతీయీకరణ, మదర్సా విద్యాలయాల పునర్వ్యవస్థీకరణ)-2018ల రద్దును ప్రతిపాదించింది. కేబినెట్ డిసెంబర్ 13న ఈ బిల్లును ఆమోదించింది. కాగా… కాంగ్రెస్ తో పాటు అల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. అందుకు నిరాకరించిన అధికార పక్షం నేరుగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్, ఏఐయూఎఫ్ సమావేశాలను బహిష్కరించాయి. అయినప్పటికీ అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మదర్సాలన్నీ సాధారణ విద్యా సంస్థలుగా మారనున్నాయి.

ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 610 ప్రభుత్వ మదర్సాలు కనుమరుగవనున్నాయి. లౌకిక విలువతో కూడిన విద్యా ప్రణాళిక అమలుకు ఈ మార్పుదోహదం చేస్తుందని అసోం విద్యా శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. రాష్ట్రంలోని అన్ని మదర్సాలను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేశామని, ఏప్రిల్‌ 21 నుండి మదర్సాలు సాధారణ విద్యాసంస్థలుగా మారుతాయని తెలిపారు. మదర్సాల రద్దు ప్రభావం ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది జీతాలు, నిబంధనలపై ఉండబోదన్నారు. ప్రభుత్వం భవిష్యత్తులో కూడా మదర్సాలను ఏర్పాటు చేయబోదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ మదర్సాల రద్దు మాత్రమే కాదు… ప్రైవేటు మదర్సాల విషయంలోనూ అసోం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ప్రైవేటు మదర్సాల రెగ్యులైజేషన్ కోసం కొత్త బిల్లును ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ప్రైవేటు మదర్సాల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేస్తూ బిల్లును రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. కాగా… మదర్సాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మదర్సాల్లో కేవలం ఇస్లాం, అరబిక్ మాత్రమే నేర్పించరని సాధారణ పాఠశాలల్లో బోధించే అన్ని అంశాలనూ బోధిస్తారని ప్రతిపక్షాలు, మైనార్టీ సంస్థలు వాదిస్తున్నాయి. ముస్లింల ప్రాథమిక హక్కులను హరించడంలో భాగంగానే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందంటున్నాయి. మైనార్టీల అణచివేత లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

ప్రభుత్వం చెబుతున్న లౌకికతత్వం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మదర్సాల రద్దుకు ఉపక్రమించిన ప్రభుత్వం సంస్కృత పాఠశాలల విషయంలో మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తుండడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. లౌకికత్వాన్ని వ్యతిరేకించే బీజేపీయే విద్యా వ్యవస్థలో లౌకికత్వాన్ని ప్రోత్సహించేందుకే మదర్సాల రద్దు బిల్లును తెచ్చామని చెప్పడాన్ని విమర్శిస్తున్నారు. రాజ్యాంగంలోంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని మాజీ కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి మదర్సాల రద్దు బీజేపీ స్వంత ఎజెండా. చాలా కాలంగా మదర్సాల పట్ల బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఇప్పుడు అధికారికంగానే వాటి రద్దుకు పూనుకుంది. మొత్తానికి బీజేపీ మాత్రం అనుకున్నది సాధించుకోగలిగింది. ఎలాంటి వ్యతిరేకత ఎదురైనా తన పంతాన్ని నెగ్గించుకోగలిగింది. భవిష్యత్తులో ఇలాంటి మార్పులు అనేకం చూడాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  31 Dec 2020 11:41 PM GMT
Next Story