Telugu Global
National

లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయా..?

కొత్తరకం కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇటీవల కర్నాటక కూడా ఇదే తరహా కర్ఫ్యూకోసం ప్రయత్నాలు చేయగా కేంద్రం వారించింది. అలాంటి కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు నైట్ కర్ఫ్యూ పై మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్తరకం కరోనా వైరస్ ని అడ్డుకునే చర్యల్లో భాగంగా అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఎక్కువమంది ఒకేచోట గుమికూడకుండా […]

లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయా..?
X

కొత్తరకం కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇటీవల కర్నాటక కూడా ఇదే తరహా కర్ఫ్యూకోసం ప్రయత్నాలు చేయగా కేంద్రం వారించింది. అలాంటి కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు నైట్ కర్ఫ్యూ పై మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్తరకం కరోనా వైరస్ ని అడ్డుకునే చర్యల్లో భాగంగా అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఎక్కువమంది ఒకేచోట గుమికూడకుండా పరిమితులు పెట్టాలని, మార్కెట్లు, ఇతర ప్రాంతాలకు టైమ్ టేబుల్ ఇవ్వాలని, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఏపీ అధికారిక ఉత్తర్వులు..
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ రోజు సీఎస్ నీలం సాహ్ని ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా విధించే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అన్ లాక్ కి ముందు ఉన్నట్టుగానే విద్య, సాంస్కృతిక, మత సంబంధం కారక్యక్రమాలకు హాజరయ్యేవారి సంఖ్యపై గరిష్ట పరిమితి విధించారు. సమావేశ మందిరాల్లో సీటింగ్ కెపాసిటీలో 50శాతం మాత్రమే హాజరు కావాలనే నిబంధనను తిరిగి తెరపైకి తెచ్చారు. మార్కెట్లు, ఇతర వ్యాపార సముదాయాల్లో కచ్చితంగా సామాజిక దూరాన్ని అమలు చేయాలి. ప్రజా రవాణా విషయంలో ఇటీవల ఈ నిబంధనలు పక్కనపెట్టారు. గతంలో సీటు వదిలి సీటు మాత్రమే కేటాయించేవారు. కరోనా భయం తగ్గుతుండటంతో ప్రజలు కూడా పక్క పక్క సీట్లలో కూర్చోవడం అలవాటు చేసుకున్నారు. కొత్త కరోనా భయంతో మరోసారి ఎడబాటు తప్పేలా లేదు. కంటైన్మెంట్ జోన్లు గుర్తించి అక్కడ కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతిస్తారు. జనవరి 31వరకు కొవిడ్ ఆంక్షలు అమలులో ఉండబోతున్నాయి. ఇవేవీ కొత్త నిబంధనలు కావు.. కరోనా భయం తగ్గుతున్న వేళ, అందరూ మర్చిపోతున్న నిబంధనలు. అయితే కొత్తరకం కరోనా భయంతో ఈ నిబంధనలను తిరిగి పాటించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
కొత్తరకం కరోనా వైరస్, పాతదానికంటే 70శాతం ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందనే ప్రచారం ప్రభుత్వాలను కుదురుగా ఉండనీయడంలేదు. చైనా వైరస్ విషయంలో జరిగిన తప్పులన్నిటినీ మరోసారి పునరావృతం చేయకూడదనే ఉద్దేశంతోటే.. బ్రిటన్ లో కేసులు బైటపడిన వారాల వ్యవధిలోనే ప్రయాణాలపై భారత్ నిషేధం విధించింది. తాజాగా ఈ గడువుని ఈనెల 7 వరకు పొడిగించింది. అయితే బ్రిటన్ లో కొత్తరకం కరోనా మొదలైన తర్వాత దాదాపు 33వేలమంది ప్రయాణికులు భారత్ కు వచ్చినట్టు అంచనా. వీరందరి ఆచూకీ, అడ్రస్ లు ప్రభుత్వం వద్ద లేవు. ఇలా వచ్చినవారిలో కొందరికి పరీక్షలు చేయగా.. 25మందికి కొత్తరకం వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. కొత్తరకం కరోనా వల్ల మరింత ప్రమాదం ఉందని కొంతమంది వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న దశలో.. అసలీ వైరస్ వల్ల అనారోగ్యంలో కానీ, వ్యాధి తీవ్రతలో కానీ మార్పులేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య నిపుణురాలు మారియా వాన్‌ కెర్ఖోవే వెల్లడించడం గమనార్హం.
ప్రస్తుతానికి కొత్తరకం కరోనా వ్యాప్తిపై ఉన్నవన్నీ అనుమానాలే. ఆ అనుమానాలతోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. గతంలో చైనా వైరస్ విషయంలో జరిగిన తప్పుల్ని ఈసారి రిపీట్ కాకుండా ముందస్తుగా ఆంక్షలు విధిస్తున్నారు. అటు ప్రజల్లో కూడా మాస్క్ ల వినియోగం పెరుగుతోంది. శానిటైజర్లను తిరిగి తమ వెంట తీసుకెళ్లడం అలవాటు చేసుకుంటున్నారు. చైనా వైరస్, బ్రిటన్ వైరస్.. రేపు ఇంకేదో వైరస్ వస్తుందని భయపడటం కంటే.. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం అనే అంశాలను జీవనశైలిలో భాగంగా మార్చుకోవడం ఒక్కటే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.

First Published:  31 Dec 2020 9:10 PM GMT
Next Story