Telugu Global
National

తమిళ రాజకీయాల్లో అటు బీజేపీ, ఇటు ఎంఐఎం

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీల హడావిడి మొదలైంది. పొత్తులపై ఇప్పటికే ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే, బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయాలనే అంగీకారానికి వచ్చాయి. డీఎంకే, కాంగ్రెస్ స్నేహబంధం కూడా కొనసాగుతోంది. ఈ మధ్యలో కొత్త పార్టీలూ తెరమీదకొచ్చాయి. దీంతో తమిళనాట రాజకీయ హడావిడి అప్పుడే మొదలైంది. గత ఏడాది చివర్లో రాజకీయ రంగప్రవేశం చేస్తానన్న […]

తమిళ రాజకీయాల్లో అటు బీజేపీ, ఇటు ఎంఐఎం
X

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీల హడావిడి మొదలైంది. పొత్తులపై ఇప్పటికే ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే, బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయాలనే అంగీకారానికి వచ్చాయి. డీఎంకే, కాంగ్రెస్ స్నేహబంధం కూడా కొనసాగుతోంది. ఈ మధ్యలో కొత్త పార్టీలూ తెరమీదకొచ్చాయి. దీంతో తమిళనాట రాజకీయ హడావిడి అప్పుడే మొదలైంది.

గత ఏడాది చివర్లో రాజకీయ రంగప్రవేశం చేస్తానన్న రజనీకాంత్ చేతులెత్తేయడంతో తమిళనాట రాజకీయ సమీకరణలు వేగం మారుతున్నాయి. ఆధ్యాత్మిక రాజకీయాలకు శ్రీకారం చుడతానన్న రజనీకాంత్ అనారోగ్యకారణాలతో వెనకడుగు వేశారు. మరోవైపు ఇప్పటికే పార్టీని స్థాపించిన మరో తమిళనటుడు కమల్ హాసన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక మరో తమిళ హీరో విజయ్ కూడా రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పక్క చూపులు చూస్తున్నాయి. కొత్త పార్టీల రాకడతో ఉన్న తమ బలం సన్నగిల్లుతుందని అభిప్రాయపడుతున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు పొత్తుల విషయంలో కలిసొచ్చే వారికి కోసం ఎదురుచూస్తున్నాయి.

ఇప్పటికే అధికార అన్నాడీఎంకే, బీజేపీ కూటమి మధ్య సఖ్యత లోపించినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఇరు పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఇప్పటికే అన్నాడీఎంకే తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ప్రకటించింది. కాగా, బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని తామే ఎన్నుకుంటామని వాదిస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. రాజ్యసభలో సరైన మెజార్టీ లేకపోవడంతో బీజేపీకి అన్నాడీఎంకే లాంటి పార్టీల మద్దతు అనివార్యం. ఈ నేపథ్యంలో దక్షిణాదిన పట్టుసాధించాలనుకుంటున్న బీజేపీ అన్నాడీఎంకే స్నేహన్ని వదులుకునే అవకాశం కనిపించడం లేదు.

మరోవైపు బీహార్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న మజ్లిస్ పార్టీ ఈ సారి తమిళనాడు ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మజ్లిస్ పార్టీతో కలిసి పోటీచేయడానికి సిద్ధమే అంటూ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకులు కమల్ హాసన్ ప్రకటించారు. తాజాగా డీఎంకే చూపు ఎంఐఎంపై పడినట్లు తెలుస్తోంది. చెన్నైలో జరగనున్న త‌మ పార్టీ మహానాడులో పాల్గొనాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి డీఎంకే ఆహ్వానం పలికింది. 6వ తేదీన జరగనున్న మహాసభలో అసదుద్దీన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు డీఎంకే, ఎంఐఎం మధ్య చిగురిస్తున్న స్నేహాన్ని సంకేతంగా భావిస్తున్నారు విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఎంఐఎం భాగం కాబోతుందనే ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి తమిళ రాజకీయాల్లో అటు బీజేపీ, ఇటు ఎంఐఎం పార్టీలు కీలకంగా మారనున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే కూటమిల్లో ఎవరికి అధికారం దక్కినా బీజేపీ, ఎంఐఎం పార్టీల పాత్ర కీలకంగా మారనుంది. అదే సమయంలో ఎంఐఎం డీఎంకే కూటమిలో చేరకపోతే మాత్రం అధికార పక్షానికే ప్రయోజనం చేకూరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఏ పార్టీ జట్టులో చేరుతుందో చూడాలి మరి.

First Published:  2 Jan 2021 1:20 AM GMT
Next Story