Telugu Global
National

బీజేపీ వ్యాక్సిన్ నేను వేయించుకోనూ..

వైరస్ కు కులం, మతం లాంటి పట్టింపులేవీ లేవు. అలాగే వ్యాక్సిన్ కి కూడా ప్రాంతీయ బేధాలు, పార్టీ తగాదాలు ఏవీ ఉండవు. కానీ… భారతదేశం మాత్రం అందుకు అతీతమైంది. ఎందుకంటే…. కరోనాకు ఒక మతమే కారణమని, ఒక ప్రాంతం వల్లే వచ్చిందని జనంపై దాడులకు తెగబడ్డ ఘనత భారతదేశానికి ఉంది. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోనూ అలాంటి వాదనే ముందుకు వచ్చింది. దేశంలో తయారవుతున్న వాక్సిన్ ను నమ్మబోనని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన […]

బీజేపీ వ్యాక్సిన్ నేను వేయించుకోనూ..
X

వైరస్ కు కులం, మతం లాంటి పట్టింపులేవీ లేవు. అలాగే వ్యాక్సిన్ కి కూడా ప్రాంతీయ బేధాలు, పార్టీ తగాదాలు ఏవీ ఉండవు. కానీ… భారతదేశం మాత్రం అందుకు అతీతమైంది. ఎందుకంటే…. కరోనాకు ఒక మతమే కారణమని, ఒక ప్రాంతం వల్లే వచ్చిందని జనంపై దాడులకు తెగబడ్డ ఘనత భారతదేశానికి ఉంది. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోనూ అలాంటి వాదనే ముందుకు వచ్చింది. దేశంలో తయారవుతున్న వాక్సిన్ ను నమ్మబోనని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకూ అఖిలేష్ ఆంతర్యమేంటి?

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఊపిరి బిగబట్టుకొని బతుకుతున్న జనాలు ఎప్పుడెప్పుడా అన్నట్లు ఆతృతగా ఉన్నారు. దేశంలోనూ పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యాయి. వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తామని ఇప్పటికే ప్రధాని పలుమార్లు ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భారత్ లో తయారవుతున్న వ్యాక్సిన్ పట్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం అందుబాటులోకి తేనున్న వ్యాక్సిన్ నమ్మతగింది కాదని అఖిలేష్ యాదవ్ అంటున్నారు. ఆ వ్యాక్సిన్ ‘బీజేపీ వ్యాక్సిన్’ అని, దాన్ని వేయించుకోవడానికి తాను సిద్ధంగా లేనని తేల్చిచెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని అన్నారు. సీరం ఇనిస్టిట్యూట్ తో కలిసి ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలు అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’, భారత్ బయోటిక్ రూపొందించిన ‘కొవాగ్జిన్’ ల అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియా అనుమతించిన సందర్భంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నిజానికి కరోనాను ఓడించేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్ని్స్తున్నాయి. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల భ్రమలు తొలగించేందుకు దేశాధినేతలే ముందుకు వచ్చి తొలి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌ దేశంలో అందరికంటే ముందు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సైతం తొలి వ్యాక్సిన్ ను వేయించుకున్నాడు. భారతదేశంలో రూపొందుతున్న వ్యాక్సిన్ విషయంలోనూ ఇప్పుడు అలాంటి చర్చే జరుగుతోంది. ప్రజల కంటే ముందు మన దేశాధినేతలే వ్యాక్సిన్ వేయించుకుంటారా? అనే ప్రశ్న పలువురి మెదళ్లను తొలుస్తోంది. అక్కడే అసలు సమస్య ఉంది.

దేశంలో రూపొందుతున్న వ్యాక్సిన్ సామర్థ్యంపై ఇప్పటి వరకూ లోతైన పరిశోధనలు జరగలేదు. అయినప్పటికీ వాటి వినియోగానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవల్సి ఉంది. ఏకకాలంలో సీరం ఇనిస్టిట్యూట్ రూపొందిస్తున్న వ్యాక్సిన్, దేశీయ సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్ వినియోగానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో ఏ వ్యాక్సిన్ ఎవరికి వినియోగిస్తారు? ప్రజలందరికీ ఒకే తరహా వ్యాక్సిన్ అందిస్తారా? లేదా? అనేది ప్రశ్న. అఖిలేష్ యాదవ్ మాటల్లోని ఆంతర్యంకూడా అదే. అధికారంలోని పెద్దలకు, బడా బాబులకు ఒక వ్యాక్సిన్, సామాన్యులకు సాధారణ వ్యాక్సిన్ అందించే అవకాశముందని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడుతున్నారు. అందువల్లే ఈ వ్యాక్సిన్ ను నేను నమ్మబోనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటు బీజేపీ నేతలు, అటు శాస్త్రవేత్తలు సైతం అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి భారతదేశంలో రోగానికీ, మందులకు కూడా కులం, మతం, పార్టీలాంటి ప్రత్యేకతలుంటాయని అఖిలేష్ యాదవ్ చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా… మన నేతలపై వైఖరికి దర్పణం పట్టే వ్యాఖ్యలు.

First Published:  2 Jan 2021 12:04 PM GMT
Next Story