Telugu Global
NEWS

రామతీర్థంలో రాద్దాంతమెందుకు?

ఆంధ్రప్రదేశ్ లో పార్టీలన్నీ మతరాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజా సమస్యల పట్టింపు కంటే భావోద్వేగాలు రెచ్చగొట్టడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అధికార పార్టీని ఎదుర్కొనేందుకు మతాన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. తాజాగా విగ్రహాల చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. రామతీర్థంలో విగ్రహాల విధ్వంసాన్ని రాజకీయం చేయడంలో ప్రతిపక్ష పార్టీలు తలమునకలయ్యాయి. టీడీపీ, బీజేపీలు రామతీర్థంలో ఆందోళనకు దిగాయి. విగ్రహాల ధ్వంసాన్ని ప్రభుత్వ బాధ్యతా రహితంగా అభివర్ణిస్తున్న ప్రతిపక్షాలు, ప్రభుత్వం హిందువుల […]

రామతీర్థంలో రాద్దాంతమెందుకు?
X

ఆంధ్రప్రదేశ్ లో పార్టీలన్నీ మతరాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజా సమస్యల పట్టింపు కంటే భావోద్వేగాలు రెచ్చగొట్టడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అధికార పార్టీని ఎదుర్కొనేందుకు మతాన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. తాజాగా విగ్రహాల చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది.

రామతీర్థంలో విగ్రహాల విధ్వంసాన్ని రాజకీయం చేయడంలో ప్రతిపక్ష పార్టీలు తలమునకలయ్యాయి. టీడీపీ, బీజేపీలు రామతీర్థంలో ఆందోళనకు దిగాయి. విగ్రహాల ధ్వంసాన్ని ప్రభుత్వ బాధ్యతా రహితంగా అభివర్ణిస్తున్న ప్రతిపక్షాలు, ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపిస్తున్నాయి. సున్నితమైన అంశాన్ని తెరమీదకు తెచ్చిన ప్రతిపక్షాలు అధికార పార్టీని చిక్కుల్లోకి నెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రామతీర్థం పర్యటన సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ, బీజేపీలకు తామేమీ తక్కువ కాదన్నట్లు జనసేన సైతం ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ను పాకిస్తాన్ తో పోల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పాకిస్తాన్ లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఆంధ్రలో కూడా అలాంటి ధోరణే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.

మత విశ్వాసం వ్యక్తిగతమైనది. ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే అవకాశం రాజ్యాంగమే కల్పించింది. కానీ… పార్టీలు మాత్రం మతాలను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తుంటాయి. అది భారత దేశమైనా, పాకిస్తానైనా. పాకిస్తాన్ లో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం ఎంతనిజమో.. ప్రభుత్వమే ఆ దేవాలయాలను పునర్నిర్మాణానికి సంకల్పించడం అంతే నిజం. వ్యక్తులుగా చేసిన దాడులను మొత్తం దేశానికి ఆపాధించడం పవన్ కళ్యాణ్ అవివేకాన్ని గుర్తుకుచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోనూ విగ్రహాల విధ్వంసం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిందే. బాధ్యులను శిక్షించాల్సిందే. కానీ అదే రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన రాజకీయ సమస్య కాదు. మతం ప్రజల కడుపు నింపేది కాదు. వాళ్ల కష్టాలు తీర్చేది ఎంతమాత్రమూ కాదు. కానీ మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు బావోద్వేగాలు రెచ్చగొట్టేప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్షాల తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగానే ప్రతిపక్ష పార్టీలకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్నటికైనా ప్రతిపక్ష పార్టీలు నిజమైన ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

First Published:  2 Jan 2021 8:46 AM GMT
Next Story