Telugu Global
National

రైతు ఉద్యమం పట్ల కేంద్రం కొత్త ఎత్తుగడ

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన రోజు రోజుకూ తీవ్రమవుతోంది. నెల రోజులు గడిచినా మొట్టుదిగడానికి కేంద్రం ససేమిరా అంటోంది. అటు రైతు సంఘాలు సైతం వెనక్కితగ్గేడం లేదు. చర్చల విషయంలో రైతు సంఘాలు, కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన ఇప్పట్లో తొలగేలాలేదు. 6వ దఫా చర్చల కోసం రైతు సంఘాలు ప్రతిపాధించిన ఎజెండాలో ఇప్పటికే 50 శాతం నెరవేరాయని, జనవరి 4న జరిగే భేటీలో మొత్తం పరిష్కారమవుతాయని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ […]

రైతు ఉద్యమం పట్ల కేంద్రం కొత్త ఎత్తుగడ
X

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన రోజు రోజుకూ తీవ్రమవుతోంది. నెల రోజులు గడిచినా మొట్టుదిగడానికి కేంద్రం ససేమిరా అంటోంది. అటు రైతు సంఘాలు సైతం వెనక్కితగ్గేడం లేదు. చర్చల విషయంలో రైతు సంఘాలు, కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన ఇప్పట్లో తొలగేలాలేదు. 6వ దఫా చర్చల కోసం రైతు సంఘాలు ప్రతిపాధించిన ఎజెండాలో ఇప్పటికే 50 శాతం నెరవేరాయని, జనవరి 4న జరిగే భేటీలో మొత్తం పరిష్కారమవుతాయని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన ప్రకటన పట్ల రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయ మంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని రైతు సంఘాలు ఆరోపించాయి. విద్యుత్తు సవరణ చట్టంతో పాటు వాయుకాలుష్యం ఆర్డినెన్సులో రైతుల అభ్యంతరాలను పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్న మంత్రి వ్యాఖ్యలు పూర్తి అవాస్తవమని ఆరోపించాయి. దీంతో జనవరి 4న కూడా సమస్యకు పరిష్కారం లభించేలా కనిపించడం లేదు.

నెల రోజులకుపై ఆందోళనలను కొనసాగిస్తున్న రైతు సంఘాలు మొదటి నుంచీ వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడాన్ని ప్రధాన డిమాండ్లుగా వినిపిస్తున్నాయి. కాగా.. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ విషయంలో కేంద్రం వైపు నుంచి సానుకూల స్పందన రాలేదు. జనవరి 4 నాటికి కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి. జనవరి 6న భారీ నిరసన ర్యాలీ చేపడతామన్నాయి. కుండ్లీ నుంచి మానేసర్ మీదుగా పల్వాల్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని స్వరాజ్ ఇండియా స్థాపకులు యోగేంద్ర యాదవ్ అన్నారు. జనవరి 6న నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీతో రైతు ఉద్యమ సత్తా చాటుతమని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకుల్ని కూడా మూసివేస్తామని హెచ్చరించారు.

ఓవైపు చర్చల ప్రక్రియను కొనసాగిస్తూనే మరోవైపు వ్యవసాయ చట్టాలకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. మొదటి నుంచీ రైతు ఉద్యమంలో ఒకటి రెండు రాష్ట్రాల రైతులే పాల్గొంటున్నారని ప్రచారం చేస్తున్న బీజేపీ అన్నివర్గాల నుంచీ వ్యవసాయ చట్టాలకు మద్దతు ఉందని చాటుకోవాలనుకుంటోంది. ఇప్పటికే 25 రైతు సంఘాలు వ్యవసాయ మంత్రి తోమర్ ని కలిసి వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించాయి. తాజాగా వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ 850 మంది విద్యావేత్తలు ఓ బహిరంగలేఖను విడుదల చేశారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టం జరుగుతుందనే ప్రచారాన్ని నమ్మొద్దని, చట్టాల వల్ల రైతులు లాభపడతారని జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, బీహెచ్‌యూ తదితర విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యావేత్తలు లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. జనవరి 1న రాజధానిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 15 ఏళ్లలో ఇదే అత్యంత కనిష్ఠం ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. చలి తీవ్రతతో గల్తాన్ సింగ్ అనే రైతు మృతి చెందాడు. ఇప్పటికే రైతు ఉద్యమంలో దాదాపు 40 మంది రైతులు చనిపోయారు. అయినా… రైతులు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఎముకలు కొరికే చలిలో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకుంటే ఆందోళనలను మరింత తీవ్రతరం చేయడానికి రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

First Published:  1 Jan 2021 11:44 PM GMT
Next Story