Telugu Global
National

గులాబి పార్టీలో గుబులు మొదలైందా?

తెలంగాణలో అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయా? ‘ఉద్యమ’ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదా? గులాబి పార్టీ నేతలంతా పక్కచూపులు చూస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ దూకుడు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిన్నా మొన్నటి దాకా ఎదురులేని శక్తిగా అనిపించుకున్న టీఆర్ఎస్ కు ఇప్పుడు ఎదురు దెబ్బలు తప్పడంలేదు. అటు వరుస ఎన్నికల్లో వైఫల్యాలు, ఇటు సొంత […]

గులాబి పార్టీలో గుబులు మొదలైందా?
X

తెలంగాణలో అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయా? ‘ఉద్యమ’ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదా? గులాబి పార్టీ నేతలంతా పక్కచూపులు చూస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ దూకుడు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిన్నా మొన్నటి దాకా ఎదురులేని శక్తిగా అనిపించుకున్న టీఆర్ఎస్ కు ఇప్పుడు ఎదురు దెబ్బలు తప్పడంలేదు. అటు వరుస ఎన్నికల్లో వైఫల్యాలు, ఇటు సొంత పార్టీ నేతల అసంతృప్తితో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది.

రాష్ట్రంలో అధికార పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఓటమెరగని పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ కు దుబ్బాక, గ్రేటర్ ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు సొంతపార్టీలో అసంతృప్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. త్వరలో ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది. ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గ్రేటర్ లో టీఆర్ఎస్ తరుపున గెలిచిన కార్పోరేటర్లు కూడా తమతో కలిసిరావడానికి సిద్ధంగా ఉన్నారంటూ బాంబు పేల్చారు బండి సంజయ్. ఈ మాట అన్న రెండో రోజే భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎదగాలనుకుంటున్న బీజేపీ అందుకోసం కొత్త వ్యూహానికి తెరతీసింది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల క్యాడర్ ను తమవైపు మలుపుకునే పనిలో పడింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీ గూటికి చేరారు. తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అటు టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు.. కింది స్థాయి క్యాడెర్ పై దృష్టిసారించింది బీజేపీ. తాజాగా వరంగల్ మహానగర పాలక సంస్థకు చెందిన కార్పోరేటర్ కోరబోయిన సాంబయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ కు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. అటు ఖమ్మంలోనూ ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు.

ఉత్తర తెలంగాణలోనూ టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తప్పేలా లేవు. డిచ్ పల్లి మండలంలోని గులాబీ నేతలు భారీ సంఖ్యలో బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. పది మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఢిల్లీలో బండి సంజయ్ ని కలిసి తాము బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి తెలంగాణలో బలపడేందుకు బీజేపీ అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలుమార్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అందుకోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ బీజేపీ సత్తా చాటాలనుకుంటోంది. అదే సమయంలో అధికార పార్టీని బలహీన పరిచే ఎత్తుగడలనూ అనుసరిస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో బీజేపీ దూకుడు టీఆర్ఎస్ కు కొత్త చిక్కులు తెచ్చాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

First Published:  2 Jan 2021 11:51 PM GMT
Next Story