Telugu Global
Business

ఆశపెట్టి ఆయువు తీస్తున్న లోన్ యాప్స్

ఆన్ లైన్ లోన్ యాప్ లు ఆశపెట్టి ఆయువు తీస్తున్నాయి. రుణాల పేరుతో అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. లోన్ యాప్స్ అరాచకాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు తాజాగా మరో జీవితం బలైంది.

ఆశపెట్టి ఆయువు తీస్తున్న లోన్ యాప్స్
X

ఆన్ లైన్ లోన్ యాప్ లు ఆశపెట్టి ఆయువు తీస్తున్నాయి. రుణాల పేరుతో అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. లోన్ యాప్స్ అరాచకాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు తాజాగా మరో జీవితం బలైంది. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో చంద్ర మోహన్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేరు వేరు యాప్ లలో లక్ష రూపాయలు అప్పు తీసుకున్న చంద్రమోహన్ వడ్డీతో కలిసి ఆరు లక్షలకు పైగా చెల్లించాడు. అయినా… యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగలేదు.

లోన్ యాప్ ల వేధింపులపై పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. చంద్రమోహన్ భార్య, కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయినా లోన్ యాప్ ల వేధింపులు మాత్రం ఆగలేదు. అప్పు తీసుకున్న వ్యక్తి మరణించినా షూరిటీ ఉన్నారనే పేరిట కుటుంబ సభ్యులు, స్నేహితులకు యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి వేధిస్తుండడం గమనార్హం.

ఇటీవలి మధ్యకాలంలో ఆన్ లైన్ లోన్ యాప్ కేసులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇప్పటికే లోన్ యాప్ ల వేధింపుల కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న పోలీసులు పలువురు యాప్ నిర్వాహకులను అరెస్టు చేశారు. లోన్ యాప్ ల వెనక చైనా హస్తం ఉందని గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు చైనా దేశస్థులను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారు హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వేరు వేరు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని యాప్ లను నిర్వహిస్తున్నట్లు తేల్చారు.

ఇప్పటి వరకూ ఏడెనిమిది లోన్ యాప్ లను పోలీసులు గుర్తించినప్పటకీ ఇంకా ఆన్ లైన్ లో అనేక యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ యాప్ లు ఇప్పుడు సామాన్యులను టార్గెట్ చేసుకొని వ్యాపారం నడుపుతున్నాయి. అధిక వడ్డీ వసూలు చేస్తున్నాయి. నిర్ణీత సమయంలో వడ్డీ చెల్లించని వారిని వేధింపులకు గురిచేస్తున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో రోజు కూలీ చేసుకునే వారు, ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఆన్ లైన్ లోన్ యాప్ లను ఆశ్రయించారు. అలా యాప్ ల ద్వారా అప్పు తీసుకున్న వారిపై వడ్డీ రూపంలో ఊహించని భారం మీదపడింది. యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్రమవ్వడంతో వాళ్లంతా ఇప్పుడు ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం ఆన్ లైన్ యాప్ లపై సీరియస్ గా వ్యవహరించకపోతే మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉంది.

First Published:  3 Jan 2021 6:09 AM GMT
Next Story