Telugu Global
National

తమిళనాట అన్నదమ్ముల పోరు పతాకస్థాయికి!

తమిళనాట అన్నదమ్ముల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో డీఎంకే అధినేత స్టాలిన్ ఓటమికి ఆయన సోదరుడు కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికల వేళ అళగిరి దెబ్బ కొడతారేమోనని డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కొద్ది రోజులుగా రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్నట్లు అళగిరి ప్రకటిస్తూ వస్తున్నారు. కొత్త పార్టీ పెడతారని లేదా బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అళగిరి మదురైలో తన మద్దతు […]

తమిళనాట అన్నదమ్ముల పోరు పతాకస్థాయికి!
X

తమిళనాట అన్నదమ్ముల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో డీఎంకే అధినేత స్టాలిన్ ఓటమికి ఆయన సోదరుడు కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికల వేళ అళగిరి దెబ్బ కొడతారేమోనని డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కొద్ది రోజులుగా రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్నట్లు అళగిరి ప్రకటిస్తూ వస్తున్నారు. కొత్త పార్టీ పెడతారని లేదా బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం అళగిరి మదురైలో తన మద్దతు దారులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి ఆయన మద్దతు దారులు వేలాదిగా తరలివచ్చారు. సొంత పార్టీ పెడితే బాగుంటుందా లేదా మరొక పార్టీలో చేరితే బాగుంటుందా అనే విషయమై అళగిరి తన సన్నిహితులతో, మద్దతుదారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ ఎప్పటికీ సీఎం కాలేడని వ్యాఖ్యానించారు.

2016 అసెంబ్లీ ఎన్నికలకు తీవ్ర అనారోగ్యం పాలైన తన తండ్రి కరుణానిధిని బలవంతంగా పోటీ చేయించారని, ఆయన దయ వల్ల పార్టీ గెలిస్తే సీఎం కావొచ్చని స్టాలిన్ కలలు కన్నారని ఆరోపించారు. ఆ కల ఎప్పటికీ నిజం కాదని, స్టాలిన్ ఎప్పటికీ తమిళనాడుకు సీఎం కాలేడని అళగిరి వ్యాఖ్యానించారు. తన తండ్రి కరుణానిధికి లేనిపోనివి చెప్పి తనను పార్టీ నుంచి బయటకు గెంటివేయించారన్నారు. తాను ఎంపీ పదవి కోరుకుంటున్నట్లు, మంత్రి పదవి కోరుకుంటున్నట్లు బయట ప్రచారం చేసి చెడ్డ పేరు తెచ్చారన్నారు.

తనకు ద్రోహం చేసిన వారికి, వెన్నుపోటు పొడిచినవారికి తగిన గుణపాఠం చెబుతానన్నారు. అందుకే రాజకీయంగా క్రియాశీలమవుతున్నట్లు చెప్పారు. తన వల్లే స్టాలిన్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పదవులు పొందాడని, ఆ తర్వాత తనను సోదరుడని కూడా చూడకుండా పార్టీ నుంచి బయటకు సాగానంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అళగిరి సమావేశానికి భారీగా జనం తరలి రావడతో డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

అళగిరి కొత్త పార్టీ పెట్టినా, లేదా ఏదైనా పార్టీలో చేరినా డీఎంకే ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా అళగిరికి పట్టున్న మదురై ప్రాంతంలో డీఎంకేకు దెబ్బ పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

First Published:  4 Jan 2021 2:05 AM GMT
Next Story