అధికారం ఉంటే కులం.. అధికారం పోతే మతం..

సుడిగుండంలో కొట్టుకుపోతున్న చంద్రబాబుకి బుర్ర పనిచేయడం లేదని, అందుకే మతం అనే అంశాన్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నారని, మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అధికారంలో ఉంటే కులం, అధికారం కోల్పోతే బాబుకి మతం గుర్తొస్తుందని చెప్పారు. బూట్లు వేసుకొని దేవాలయానికి వెళ్లే చంద్రబాబు మతంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు అంబటి. సీఎం, హోంమంత్రి, డీజీపీ, విజయనగరం ఎస్పీ అందరూ క్రిస్టియన్లని, అందుకే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించడంపై అంబటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు.. హోంమంత్రి, అసెంబ్లీ స్పీకర్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సహా.. జన్మభూమి కమిటీల వరకు అందరూ బాబు వర్గంవారే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. మరి వారి హయాంలో విజయవాడలో 40 గుడుల్ని ఎందుకు కూలగొట్టారని అడిగారు. విగ్రహాలు విసిరేసి, ఆలయాలు కూలదోసి టాయిలెట్స్ కట్టారని, అలాంటి బాబు.. ఇప్పుడు హిందూ మతం గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

పుట్టుకతో క్రిస్టియన్, పాలనలో అందరివాడు జగన్..
వైఎస్సార్, జగన్.. పుట్టుకతో క్రిస్టియన్లు కావొచ్చని, కానీ పాలనలో వారిద్దరూ అందరివాళ్లుగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు అంబటి రాంబాబు. వైసీపీ అంటే క్రిస్టియన్ పార్టీ అనే బలమైన ముద్ర వేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజలెవ్వరూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు.
చంద్రబాబు బుర్ర పాడైపోయిందని, సుడిగుండంలో కొట్టుకుపోతున్న ఆయన, ఒడ్డున పడటానికి మతాన్ని పట్టుకున్నారు. ఫ్రస్టేషన్లో ఏది పడితే అది మాట్లాడుతన్నారని ఎద్దేవా చేశారు అంబటి. 14ఏళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కులాన్ని కాపాడుకోడానికి ప్రయత్నించారే కానీ, హిందూ మతానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. అమరావతిపై బాబుకి అంత ప్రేమ ఉంటే.. అమరలింగేశ్వరుడి బొమ్మ బదులు, బుద్ధుడి బొమ్మను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అర్జెంట్ గా ఆయనకిప్పుడు వీళ్లద్దరూ కాకుండా శ్రీరాముడు ఎందుకు గుర్తొచ్చారని అన్నారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. మూడూ కలిస్తేనే వైసీపీ అని వివరించారు.

మత మార్పిడులు కాదు.. పార్టీ మార్పిడులు..
చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు రాష్ట్రంలో కన్వర్షన్స్ జరుగుతున్నాయని, అయితే అవి ఆయన అనుకుంటున్నట్టు మత మార్పిడిలు కాదని, పార్టీ మార్పిడులని అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలంతా వైసీపీలోకి వస్తున్నారని చెప్పారు. మత రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ ఒప్పుకోరని, మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకోవడం దుర్మార్గమని, చంద్రబాబుని దేవుడు కూడా క్షమించరని అన్నారు. తాను హిందువుని, తాను ఎన్నికల్లో గెలిస్తే తిరుమల యాత్రకు వెళ్లేవాడిని, అదే జగన్ గెలిస్తే జెరూసలేం వెళ్తారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. పాదయాత్ర పూర్తయిన తర్వాత కాలినడకన జగన్ తిరుమల వెళ్లారని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన తిరుమల యాత్ర చేశారని గుర్తు చేశారు అంబటి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాస్టర్లకు రూ.5వేలు ఇస్తున్నారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణల్ని కూడా అంబటి కొట్టిపారేశారు. పూజారులకు, మౌజమ్ లు, ఇమామ్ లకు కూడా గౌరవ వేతనం ఇస్తుంటే కేవలం క్రిస్టియన్లకు మాత్రమే ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు. ప్రతి జిల్లాకు ఓ క్రైస్తవ భవనం నిర్మిస్తామని, ఇండిపెండెంట్ చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తామని, జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతామని మేనిఫెస్టోలో క్రిస్టియన్లకు హామీలిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్ కి క్రిస్టియానిటీ అంటగట్టి, ఇతర మతాల ద్వేషిగా చిత్రీకరించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చర్చికి వెళ్లి బైబిల్ లోని దేవుని వాక్యం కూడా చదివారని గుర్తు చేశారు.

బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నాయకుడు..
బైబిల్ పార్టీ అంటూ వైసీపీపై విమర్శలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కార్పొరేటర్ స్థాయి నాయకుడని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. బైబిల్, ఖురాన్‌, భగవద్గీత చాలా పవిత్రమైనవని, వాటికి కూడా పార్టీ పెట్టేశారని, మతంతో పని ఉన్న రాజకీయ పార్టీ వైసీపీ కాదని, కాబోదని అన్నారు. వైసీపీ పాలనలో ధర్మం నాలుగుపాదాలతో వెళ్తోందని చెప్పారు. ఆలయాల ఘటనలకు కారకులు ఎవరో, వారి వెనుక ఉన్న శక్తులు ఎవరో త్వరలోనే పోలీసు దర్యాప్తులో తేలుతుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలకి కూడా పార్టీని అంటగడుతున్నారని లోకేష్ పై మండిపడ్డారు అంబటి. కనీసం ఏదైనా ఒక ఎన్నికల్లో గెలిచి మాట్లాడాలని లోకేష్ కి ఆయన హితవు పలికారు.