ఢిల్లీని ఢీకొంటున్న అన్నదాతలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాల్చనున్నాయి. కేంద్రం నిర్లక్ష్య వైఖరికి నిరసన తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేయడానికి సిద్ధమయ్యాయి రైతు సంఘాలు. నలబై రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించిన రైతులు తమ పోరాటాన్ని దేశ మంతా విస్తరించడానికి సిద్ధమవుతున్నారు. కేంద్రం మెడలు వంచేందుకు ట్రాక్టర్ మార్చ్ ని తలపెట్టాయి రైతు సంఘాలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రాన్ని రైతు సంఘాలు తమ సత్తా చాటాలనుకుంటున్నాయి. అందుకు రిహార్సల్ గా గురువారం భారీ ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించాయి. శుక్రవారం ఎనిమిదో దఫా చర్చలు జరుగనున్న నేపథ్యంలో ట్రాక్టర్ ర్యాలీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎండ, వాన, చలిని సైతం లెక్క చేయకుండా రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులతో ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరు దఫాలు చర్చలు జరిపినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అంశాలను రైతు సంఘాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఈ రెండు డిమాండ్ల విషయంలో కేంద్రం నుంచి ఇప్పటి వరకూ సానుకూల స్పందన రాలేదు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.

జనవరి 13, 14 తేదీల్లో సాగు చట్టాల ప్రతుల దహనానికి పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. 18న మహిళా కిసాన్‌ దివస్‌ పేరుతో దేశ వ్యాప్తంగా ఆందోళనలకు రూపకల్పన చేశాయి. 23వ తేదీ నేతాజీ జయంతి సందర్భంగా ఆజాద్‌ హింద్‌ కిసాన్‌ దివస్‌ను జరుపనున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీ రాజ్‌పథ్‌లో ట్రాక్టర్ల కవాతు నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ట్రాక్టర్ల మార్చ్ కి రిహార్సల్ గా గురువారం భారీ ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించాయి రైతు సంఘాలు.

జనవరి 26 ట్రాక్టర్ మార్చ్ కి సన్నాహకంగా నిర్వహిస్తున్న ఈ ట్రాక్టర్ ర్యాలీని 3500కు పైగా ట్రాక్టర్లతో ప్రారంభించారు రైతులు. కుండ్లి – మనేసర్ – పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సాంతం ట్రాక్టర్లు ఆక్రమించాయి. దాదాపు 135 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిండిపోయాయి. పంజాబ్, హర్యాన రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రాక్టర్ ర్యాలీ ద్వారా తమ డిమాండ్లను మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు నేతలు చెబుతున్నారు. రేపు ఎనిమిదో దఫా చర్చలు జరుగనున్న నేపథ్యంలో ట్రాక్టర్ ర్యాలీ కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి దోహదపడుతుందని రైతులు భావిస్తున్నారు. మొత్తానికి ఎనిమిద దఫా చర్చల్లో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే రైతు ఆందోళనలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.