Telugu Global
National

మళ్లీ మొదలైన మాటల యుద్ధం

తెలంగాణలో మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో వేడెక్కిన తెలంగాణ రాజకీయం ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు. వరుస విజయాలతో దూకుడుమీదున్న బీజేపీ అవకాశం దొరికినప్పుడల్లా అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే ఉంది. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ, బీజేపీ మధ్య మాటలయుద్ధం పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, బాల్క సుమన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. […]

మళ్లీ మొదలైన మాటల యుద్ధం
X

తెలంగాణలో మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో వేడెక్కిన తెలంగాణ రాజకీయం ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు. వరుస విజయాలతో దూకుడుమీదున్న బీజేపీ అవకాశం దొరికినప్పుడల్లా అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే ఉంది. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ, బీజేపీ మధ్య మాటలయుద్ధం పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, బాల్క సుమన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం మరోమారు వేడెక్కింది. తాజాగా వరంగల్ పర్యటనలో భాగంగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికలకు ముందే ఇరు పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. వరంగల్ పర్యటనలో భాగంగా బండి సంజయ్ కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. మందు తాగి వాహనం నడపడం నేరమైనప్పుడు, మందు తాగి రాష్ట్రాన్ని నడిపితే నేరం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు సంజయ్.

బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. అధినేత మౌనం వహిస్తున్నప్పటికీ, ఎమ్మెల్యేలు మాత్రం మండిపడుతున్నారు. ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బండి సంజయ్ కి గట్టి రిప్లై ఇచ్చారు. కేసీఆర్ పై నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తాం అంటూ హెచ్చరించారు. ఎన్నికలు రాగానే సంజయ్ కి భద్రకాళి ఆలయం గుర్తొస్తుందని, వరదలొచ్చినప్పుడు బీజేపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. వరంగల్ అభివృద్ధికి కేంద్రం ఏం సాయం చేసిందో చెప్పాలన్నారు. చివరకు పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నిలబెట్టుకోలేదన్నారు. ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సైతం బండి సంజయ్ పై దాడిని ఎక్కుపెట్టారు. ‘ఏం బలిసిందా.. బండి సంజయ్…’ అంటూ పరుష పదజాలాన్ని ప్రయోగిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తోలు తీస్తామంటూ హెచ్చరించారు. మహారాష్ట్రలో బాల్ థాక్రే ని ఎవరైనా అవమానిస్తే శివసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అలాగే స్పందించాలని కోరారు. పనిలో పనిగా ప్రభుత్వాన్ని విమర్శించే వారందరినీ హెచ్చరించారు బాల్క సుమన్. టైం వచ్చినప్పుడు అందరి లెక్కలు తీస్తామన్నారు.

కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రధాన ఫోకస్ పెట్టింది. వరుసగా నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే పనిలో పడింది. కానీ బీజేపీ నేతలు మాత్రం దూకుడును ప్రదర్శిస్తూనే ఉన్నారు. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు సైతం మాటకు మాట సమాధానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి తాజా పరిణామాలతో తెలంగాణలో మళ్లీ అధికార పార్టీ, బీజేపీ మధ్య వార్ మొదలైంది

First Published:  7 Jan 2021 12:08 AM GMT
Next Story