విజయ్​ సినిమాకు ఎదురుదెబ్బ.. 100 శాతం ఆక్యుపెన్సీకి నో ఛాన్స్​..!

తమిళనాడు రాష్ట్రంలో ఈ పొంగల్​కు 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు విడుదల చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ జీవో కూడా విడుదల చేసింది. అయితే తాజాగా ప్రభుత్వం ఆ జీవోను సంహరించుకుంది. ఈ పొంగల్​కు తమిళనాడులో ఇలయదళపతి విజయ్​ హీరోగా నటించిన మాస్టర్, శింబు నటించిన ఈశ్వరన్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ చిత్రాలు భారీ బడ్జెట్​తో నిర్మించారు.

50 శాతం ఆక్యుపెన్సీతో విడుదల చేస్తే లాభాలు రావడం చాలా కష్టం. దీంతో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని ఆ చిత్ర నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. హీరో విజయ్​ నేరుగా తమిళనాడు సీఎం పళనిస్వామితో సమావేశమై ఈ విషయమై అభ్యర్థించారు. దీంతో ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదల చేసుకోవచ్చని ఈ జీవో విడుదల చేసింది.

అయితే ఈ జీవోపై కేంద్ర హోంశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పునరాలోచించుకోవాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. తాజాగా రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవోను పునః పరిశీలించాలంటూ మద్రాస్​ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొన్ని గంటల్లోనే పళనిస్వామి ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నది.

కేంద్రప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పూర్తిస్థాయి ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని 50 శాతం ప్రేక్షకులనే అనుమతించాలని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు మద్రాస్​ హైకోర్టు మధురై ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

రాష్ట్రప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. మధురైకి చెందిన న్యాయవాది ముత్తుకుమార్​ బృందం మద్రాస్​ హైకోర్ట్​ మధురై బెంచ్​లో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ శుక్రవారం మధురై విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ భయం ఇంకా తొలగిపోలేదన్నారు. పైగా పాఠశాలలు కూడా ఇంకా తెరుచుకోలేదని గుర్తుచేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లలోకి 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తే కరోనా వైరస్​ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. అందువల్ల 100 శాతం ప్రేక్షకుల సామర్థ్యంతో థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వొద్దని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్​ జనరల్​ వాదనలు వినిపిస్తూ నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు.
ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులను పునః సమీక్షించుకోవాలని ఆదేశించింది.