ఆంధ్రప్రదేశ్ లో కుట్ర రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. విగ్రహాల విధ్వంసాన్ని అడ్డుపెట్టుకొని మత రాజకీయాలకు తెరతీశాయి. అధికార పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ప్రతిపక్షాలన్నీ ఒకే గొంతుతో విరుచుపడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఆలయాలపై దాడులు యాదృచ్చికంగా జరుగుతున్నాయా? లేక ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్నాయా అనే చర్చమొదలైంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రాష్ట్రంలో మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పథకం ప్రకారం
కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనమన్నారు. విగ్రహాల ధ్వంసం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో పాటు ప్రజల్లో వైషమ్యాలు పెంచేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను అడ్డుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మతసామరస్య కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జీవోని కూడా విడుదల చేశారు. మతసామరస్యాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేయనున్న ఈ కమిటీల్లో అన్ని మతాల వారూ ఉంటారని సీఎస్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందనే విషయాన్ని సీఎస్ ప్రకటించడానికి ముందే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇదే విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఇటీవల ఓ జాతీయ మీడియాలో తప్పుబట్టారు. జగన్మోహన్ రెడ్డిని కొందరు క్రిస్టియన్ అంటున్నారని, అదెలాగో తనకు అర్థం కావట్లేదని అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పూజలో పాల్గొనే ఆయన క్రిస్టియన్ ఎలా
అవుతారని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని, టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్ ఆడిట్ చేయించాలనే గొప్ప ఆలోచన చేసిందని అన్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందన్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవల్సింది పోలీసులని, బీజేపీ నేతలు, ఇతర పార్టీలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని అన్నారు సుబ్రహ్మణ్య స్వామి. జగన్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం వెనక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో జట్టుకట్టి ఓటమిని మూటగట్టుకున్న బాబు పూర్వవైభవం కోసం ప్రాకులాడుతున్నాడని, అందుకోసమే హిందుత్వను అస్త్రంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

తాజాగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కూడా రాష్ట్రంలో వైషమ్యాలు పెంచేందుకు కుట్ర జరుగుతోందన్నారు. మరి… సీఎస్ మాటల్లో ఆ కుట్ర చేస్తున్నది సుబ్రహ్మణ్యస్వామి అన్నట్లు చంద్రబాబేనా? ఇప్పుడు ఈ సందేహం పలువురు మెదళ్లను తొలుస్తోంది. మొత్తానికి సుబ్రహ్మణ్య స్వామి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్దేశ్యపూర్వక కుట్ర జరుగుతుందనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఆ కుట్ర వెనక ప్రధాన ప్రతిపక్షాలున్నాయని అర్థమవుతోంది. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఆలయాలపై దాడులను అస్త్రాలుగా ప్రయోగిస్తున్నాయని సామాన్యులకు కూడా అర్థమవుతోంది. ఇప్పటికైనా ఈ ఇలాంటి కుట్ర రాజకీయాలను వీడకపోతే… మరింత నష్టం జరిగే ప్రమాదముంది.