సాగర్ ఛాన్స్ ని కాంగ్రెస్ వదిలేసుకుందా..?

టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటీ తీవ్రమవుతున్న వేళ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను సాకుగా చూపి ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రంలో ఆధిపత్యపోరుని అలా చల్లార్చామని అధిష్టానం భావించినా.. సాగర్ ఉప ఎన్నికను కొత్త అధ్యక్షుడికి లిట్మస్ టెస్ట్ గా పెట్టే అవకాశాన్ని కోల్పోయింది.

కాంగ్రెస్ అధిష్టానం ముందు ఇప్పటి వరకూ రెండు ఆప్షన్ లు ఉన్నాయి. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించి.. సాగర్ ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించి హడావిడి చేయడం ఒకటి. ఒకవేళ సాగర్ లో విజయం దక్కితే.. అదే ఉత్సాహంతో ముందుకెళ్లొచ్చు. కొత్త అధ్యక్షుడి పనితీరు చూపించి అసంతృప్తులను బుజ్జగించొచ్చు.

ఆప్షన్ 2, వాయిదా మంత్రం..
తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తే.. అప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్నవారు ఉప ఎన్నికల కోసం కలసిరారనే భయం అధిష్టానానికి ఉంది. ప్రస్తుతం టీపీసీసీ రేస్ లో ఉన్న వారంతా సాగర్ అభ్యర్థి జానారెడ్డికంటే బాగా జూనియర్లు. వారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రచారం చేయడం మాజీ మంత్రి జానాకు ఇబ్బందిగా ఉండొచ్చు. అందుకే వాయిదా మంత్రంతో వ్యవహారాన్ని చక్కబెట్టామనుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు.

సాగర్ లో కాంగ్రెస్ బలం ఎంత..?
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తోంది. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7,771 ఓట్ల మెజార్టీతో గెలిచారు నోముల. టీఆర్ఎస్ కి 46 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ కి 42 శాతం వచ్చాయి. ఇక బీజేపీ సోదిలో కూడా లేకుండా పోయింది. నాగార్జున సాగర్ లో ఆ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతం 1.48
కాంగ్రెస్ కి నాగార్జున సాగర్ లో బలమైన పునాదులున్నాయని చెప్పడానికి గత ఫలితాలే నిదర్శనం. అయితే ఇప్పుడలాంటి పరిస్థితులు ఉంటాయని ఊహించలేం. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో బీజేపీ కాలరెగరేస్తోంది. సాగర్ లో కూడా సత్తా చూపేందుకు కేంద్ర అధినాయకత్వం సిద్ధమవుతోంది. ఈ దశలో టీపీసీసీ పదవిని భర్తీ చేసి, వారికే గెలుపు బాధ్యతలు అప్పగించి, అధినాయకత్వం కూడా ప్రచారంలో పాల్గొంటే.. కాంగ్రెస్ కి పరిస్థితులు అనుకూలించేవ‌ని అంటున్నారు కొంతమంది. ఎలాగూ సీనియర్ నాయకుడు జానారెడ్డినే సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ డిక్లేర్ చేసింది కాబట్టి.. కాస్త కష్టపడితే రాష్ట్రంలో తిరిగి ఉనికి చాటుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. అయితే టీపీసీసీ భర్తీపై కాంగ్రెస్ వెనకడుగు వేయడంతో.. ఈ ఎన్నికల వ్యవహారం చప్పగా సాగుతుండదనంలో ఎలాంటి సందేహం లేదు. జీహెచ్ఎంసీ ఫలితాలతో అస్త్ర సన్యాసం చేసిన పాత అధ్యక్షుడు సాగర్ గెలుపు బాధ్యత తీసుకుంటారని అనుకోలేం. టీపీసీసీ పదవికోసం ఎదురు చూస్తున్నవారు.. మరీ పూసుకుని పనిచేస్తారనీ ఊహించలేం.