ఆర్థిక నేరగాడితో మాజీ సీఎం భార్య లావాదేవీలు.. ఇంతకీ ఏమిటి విషయం?

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రెండో భార్య, ప్రముఖ నటి రాధిక చిక్కుల్లో పడ్డారు. ఇటీవల పోలీసులకు చిక్కిన ఓ ఆర్థికనేరగాడు ఆమె అకౌంట్​లోకి భారీగా నగదు పంపించడమే ఇందుకు కారణం. అయితే ఈ ఆర్థికనేరాలతో నటి రాధికకు.. ఆమె భర్త కుమారస్వామికి ఏమైనా సంబంధం ఉందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజకీయనాయకుల పేరుతో పలువురిని మోసగించిన కేసులో యువరాజ్​ అలియాస్​ స్వామి అనే వ్యక్తి ఇటీవల పోలీసులకు చిక్కాడు. యువరాజ్​ ఆర్​ఎస్​ఎస్​ నాయకుడినని.. తనకు పలువురు పెద్దలు పరిచయమున్నారని చెప్పి.. అనేక మందిని మోసగించాడు. వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు.

అయితే ఈ కేసును విచారిస్తున్న సైబర్​ క్రైమ్​ పోలీసులు పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. యువరాజ్​ ఇటీవల తన అకౌంట్​నుంచి భారీ మొత్తంలో నగదును మాజీ సీఎం భార్య రాధికకు పంపినట్టు సైబర్​ క్రైం పోలీసులు గుర్తించారు. రాధిక ప్రముఖ నటి.. ఆమె తెలుగులో కూడా ఓ చిత్రంలో నటించారు.

ఆమెను కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రెండో పెళ్లి చేసుకున్నారు. కుమారస్వామి మొదటి భార్య అనితా కుమారస్వామి కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆమె ప్రస్తుతం జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే యువరాజ్​కు రాధికకు మధ్య ఆర్థికలావాదేవీలు జరగడం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ కేసులో భాగంగా సైబర్​ క్రైం పోలీసులు రాధికను కూడా విచారించనున్నారు. ఇప్పటికే ఆమెకు నోటీసులు పంపించారు. ఈ విషయంపై రాధిక స్పందించారు. యువరాజ్​కు తమ కుటుంబంతో 17 ఏళ్లుగా పరిచయం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ చారిత్రత్మక సినిమా తీసేందుకు యువరాజ్​ తనకు రూ. 15 లక్షలు, మరో నిర్మాత రూ. 60 లక్షలు పంపించారని చెప్పారు. అంతేకానీ అతడితో తనకు ఏ రకమైన ఆర్థికలావాదేవీలు లేవని చెప్పారు. పోలీసులు ఇప్పటికే రాధిక సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. రేపు రాధికను కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం.