కోర్టు మెట్లెక్కిన ‘స్థానిక’ పంచాయితీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కొత్త వివాదాలకు దారితీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనబోమంటూ ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పాయి. మరోవైపు షెడ్యూల్ విడుదల కావడంతో నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు నిలిచిపోనున్నాయి.

ఎన్నికల కోడ్ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. మరో రెండు రోజుల్లో నెల్లూరులో అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం జరుగనుంది. ఇప్పుడు కోడ్ కారణంగా రెండో విడుత అమ్మ ఒడి కార్యక్రమానికి సైతం ఆగిపోనుంది. దీంతో ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయం పట్ల అటు ప్రజల నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా… కోడ్ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని, పట్టణ ప్రాంతాలకు వర్తించదని ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంత లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడం కోడ్ ఉల్లంఘనే అవుతుందని తేల్చింది.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పాయి. ఉద్యోగులు, ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. పంచాయతీ ఎన్నికలకు సహకరించ కూడదని ఏకగ్రీవ తీర్మాణం చేశాయి. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించవద్దని డిమాండ్ చేశాయి. కరోనా సాకు చూపి అర్థాంతరంగా ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ ఇప్పుడు ఎలా ఎన్నికలు నిర్వహించాలనుకుంటోందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. ఉద్యోగుల ప్రాణాలకు ఎన్నికల సంఘం బాధ్యత పడుతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్ఈసీ నిర్ణయాన్ని పోలీసు శాఖ కూడా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పోలీసు అధికారుల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 109 మంది పోలీసులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది కరోనా బారిన పడ్డారని ఒక ప్రకటనలో తెలిపింది. పోలీసు సిబ్బంది కూడా వ్యాక్సిన్ వేయించుకోవల్సి ఉన్నందున, వాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టలేమన్నారు.

మరోవైపు ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. కరోనా ఉధృతి, వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ లో ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్ ను న్యాయస్థానం సోమవారం విచారించనుంది. మొత్తానికి ఎన్నికల సంఘం రాజేసిన చిచ్చు రాష్ట్రంలో అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఈ విషయంలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.