బ్రిటన్ నుంచి విమానాలు.. కేంద్రంపై విమర్శలు..

విదేశాల్లో కొత్తరకం కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. లండన్ సహా.. ఇతర దేశాలన్నీ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ లోకి వెళ్తున్న వేళ.. భారత్ మాత్రం విమాన సర్వీసులను పునరుద్ధరించింది. ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. 16రోజులపాటు విమాన ప్రయాణాలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించిన కేంద్రం, నిబంధనలు సడలించడంతో బ్రిటన్ నుంచి తొలి విమానం శుక్రవారం ఢిల్లీలో ల్యాండ్ అయింది. మొత్తం 256మంది ఇందులో భారత్ కి వచ్చారు. అయితే ఇలా వచ్చిన ప్రయాణికులందర్నీ క్వారంటైన్లో ఉండేలా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. కొవిడ్ పరీక్ష ఫలితాలతో సంబంధం లేకుండా ఢిల్లీలో అడుగు పెట్టినవారంతా వారం రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని కేజ్రీవాల్ సర్కారు ఆదేశించింది. శుక్రవారం ఉదయం లండన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలోని ప్రయాణికులను పరీక్షించగా ఇద్దరికి కొవిడ్ ‘పాజిటివ్‌’ వచ్చింది. ‘నెగిటివ్‌’ వచ్చిన వారు కూడా ఏడు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్‌లో, మరో ఏడు రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ఢిల్లీ సర్కారు ఆదేశించింది. దీంతో ప్రయాణికుల్లో గందరగోళం మొదలైంది.

డిసెంబరు 23 నుంచి యూకే-భారత్‌ విమాన సర్వీసులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 6వ తేదీ నుంచి 23 వరకు వెసులుబాటు ఇచ్చింది. ఇరు దేశాల మధ్య వారానికి 15 సర్వీసులు నడుస్తాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలకు మాత్రమే ఈ సర్వీసులు నడుస్తాయి. మరోవైపు శని, ఆది వారాల్లో మూడు విమానాల్లో లండన్ నుంచి మొత్తం 780మంది భారత్ కు రాబోతున్నారు. యూకేలో కొత్తరకం కరోనా కలకలంతో ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్న వేళ, కేంద్రం అనాలోచిత నిర్ణయం తీసుకుందంటూ విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలతోపాటు.. సామాన్యులు కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈనెలాఖరు వరకు విమాన ప్రయాణాలపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రమాదకరమని ముంబైకి చెందిన లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు.

అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం కేంద్రం నిబంధనలతో సంబంధం లేకుండా.. క్వారంటైన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు విమానాల్లో వెళ్లేవారు పది గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలని విమానాశ్రయ వర్గాలు సూచించాయి. మరోవైపు భారత్ లో కూడా కొత్తరకం కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 9 మందికి యూకే తరహా కరోనా నిర్థారణ కాగా.. భారత్ లో కొత్తరకం కరోనా కేసుల సంఖ్య 82కి చేరింది