ప్రేక్షకులకు చుక్కలు చూపించిన క్రాక్

krack

ఏ ముహూర్తాన క్రాక్ అనే టైటిల్ పెట్టారో కానీ, ప్రేక్షకుల విషయంలో ఆ టైటిల్ ను నిజం చేసి చూపించారు మేకర్స్. ఈరోజంతా ఈ మూవీ కోసం పడిగాపులు పడిన ప్రేక్షకులకు నిజంగానే క్రాక్ పట్టింది. అవును.. రవితేజ సినిమా ఈరోజు పొద్దున్నుంచి రిలీజ్ కాలేదు. సాయంత్రం నుంచి, అది కూడా కొన్ని థియేటర్లలోనే షోలు పడుతున్నాయి.

రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా పేరుతెచ్చుకుంది క్రాక్. వరల్డ్ వైడ్ వెయ్యి స్క్రీన్స్ దక్కాయి ఈ సినిమాకి. ఒక్క తెలంగాణలోనే 324 స్క్రీన్స్ కేటాయించారు. అంతా బెనిఫిట్ షోస్ నుంచి మ్యాట్నీ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు.

కానీ ఆశ్చర్యకరంగా ఈ సినిమా బెనిఫిట్ షోలు పడలేదు. మార్నింగ్ షోలు పడతాయేమో అని ఎదురుచూశారు. ఆ కోరిక కూడా నెరవేరలేదు. కనీసం మ్యాట్నీకైనా బొమ్మ పడుతుందనుకున్నారు. ఆ ముచ్చట కూడా తీరలేదు. ఫైనల్ గా ఈవినింగ్ షోలతో (అది కూడా కొన్ని థియేటర్లలోనే) క్రాక్ సినిమా మొదలైంది. అలా ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. నిర్మాత ఠాగూర్ మధు ఓ తమిళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి బాకీ ఉన్నాడు. అది తీర్చకుండా క్రాక్ రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ సదరు కంపెనీ కోర్టుకెక్కిందట. దీంతో రిలీజ్ ఆగిపోయింది. ఎట్టకేలకు ఠాగూర్ మధు స్టే తెచ్చుకున్నారని సమాచారం. అలా క్రాక్ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.