జనవరి 18 నుంచి రెండుపూటల బడులు..!

కరోనా లాక్​డౌన్ తో ​ పిల్లలు స్కూల్​నే మరిచిపోయారు. ప్రైవేట్​ విద్యాసంస్థలు ఆన్​లైన్​లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లలకు పాఠాలు ఏమేరకు చెబుతున్నారో తెలియదు కానీ.. ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆన్​లైన్​ క్లాసులు ప్రారంభించినప్పటికీ అవి ముందుకు సాగడం లేదు. అందుకు కారణం ఎక్కువగా పేద విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతుంటారు. వాళ్లకు స్మార్ట్​ ఫోన్లు కొనుగోలు చేయడం .. దానికి ఇంటర్నెట్​ కనెక్షన్​ పెట్టుకోవడం ఎంతో ఇబ్బందైన విషయం. మరోవైపు మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్​ కనెక్షన్​ కూడా సరిగ్గా ఉండదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పల్లెల్లో డ్రాపవుట్స్​ పెరిగే అవకాశం ఉందని కొందరు పిల్లల హక్కుల ఉద్యమకారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పాఠశాలలు తెరవాలని నిర్ణయం తీసుకున్నది. అయితే ముందుగా 7, 8,9,10 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభించారు. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తున్నదన్న ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఈ తరగతులు కూడా ఒక్కపూట నిర్వహిస్తూ వచ్చారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకే క్లాసులు కొనసాగుతున్నాయి. కాగా కరోనా కేసుల సంఖ్య చాలా వరకు తగ్గడంతో జనవరి 18 నుంచి ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు రెండుపూటలా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కరోనాకు ముందు ఎలాగైతే తరగతులు సాగాయో అదే పద్ధతుల్లో క్లాసులు నిర్వహించనున్నారు. కరోనా నిబంధనలు, సోషల్​ డిస్టెన్స్​ పాటిస్తూ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిబంధనలు విధించనున్నది.

పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులను సమాయత్తం చేసేలా బోధన సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణ చేపట్టనున్నారు. అయితే ఒకటి నుంచి ఐదు తరగతులు ప్రారంభించడం పై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంటర్ ఫస్టియర్ తరగతులు కూడా జనవరి 18 నుంచి ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.