Telugu Global
Health & Life Style

మీ స‌మాచారాన్ని దొంగిలిస్తా అంటున్న వాట్స‌ప్‌

మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారమంతా తస్కరణకు గురవుతోందా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? ఏం కొంటున్నాం? ఎలా ఉంటున్నాం? లాంటి సమాచారమంతా మూడో మనిషి తెలుసుకుంటున్నాడా? ఆ కనిపించని నిఘా నేత్రాన్ని మనమే వెంటేసుకొని తిరుగుతున్నామా? అంటే, అవుననే సమాధానం లభిస్తోంది. మనం వాడే సోషల్ మీడియా యాప్ లన్నీ చేస్తున్న పని ఇదే. మన గోప్యతను నడిబజార్లో నిలబెడుతున్నాయి. ఇప్పుడు అందుకు మన అంగీకారాన్ని అడుగుతోంది వాట్సప్. వాట్సప్ తాజాగా అప్‌డేట్ చేసిన […]

మీ స‌మాచారాన్ని దొంగిలిస్తా అంటున్న వాట్స‌ప్‌
X

మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారమంతా తస్కరణకు గురవుతోందా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? ఏం కొంటున్నాం? ఎలా ఉంటున్నాం? లాంటి సమాచారమంతా మూడో మనిషి తెలుసుకుంటున్నాడా? ఆ కనిపించని నిఘా నేత్రాన్ని మనమే వెంటేసుకొని తిరుగుతున్నామా? అంటే, అవుననే సమాధానం లభిస్తోంది. మనం వాడే సోషల్ మీడియా యాప్ లన్నీ చేస్తున్న పని ఇదే. మన గోప్యతను నడిబజార్లో నిలబెడుతున్నాయి. ఇప్పుడు అందుకు మన అంగీకారాన్ని అడుగుతోంది వాట్సప్.

వాట్సప్ తాజాగా అప్‌డేట్ చేసిన ప్రైవసీ పాలసీ వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ ప్రకారం వినియోగదారుల ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్ వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, లొకేషన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ ఇతర సంస్థలతో పంచుకుంటుంది. అందుకు అంగీకరించాలంటూ కొద్దిరోజులుగా వాట్సప్ వినియోగదారులకు సందేశం పంపిస్తోంది.

వాట్సప్ తాజా నిర్ణయం పట్ల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రైవసీ పాలసీ వినియోగదారుల గోపత్యను దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో భారీ సంఖ్యలో వినియోగదారులు ప్రత్యామ్నాయ మెసెంజర్ యాప్ ల వైపు చూస్తున్నారు. వాటిల్లో సిగ్నల్, టెలిగ్రామ్ యాప్స్ ముందు వరుసలో ఉన్నాయి. గడిచిన రెండు మూడు రోజుల్లోనే టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. సిగ్నల్ డౌన్ లోడ్స్ ఇప్పటికే వాట్సప్ ని దాటిపోయాయని ఆ సంస్థ ప్రకటించింది. సిగ్నల్ ద్వారా పంపించే సమాచారం ఇతరులు చదివే అవకాశం లేకపోవడంతో ఎక్కువ మంది ఈ యాప్ ని ఎంచుకుంటున్నారు.

సిగ్నల్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరగడానికి వాట్సప్ తాజా నిబంధనలు ఒక కారణమైతే, ప్రముఖ వ్యాపార దిగ్గజం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ ట్వీట్ మరో కారణం. ఆయన తాజాగా యూజ్ సిగ్నల్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పడు అందరి చూపూ సిగ్నల్ యాప్ పై పడింది.

సోషల్ మీడియా యాప్స్ ని మనం ఉచితంగా వినియోగించుకుంటున్నప్పటికీ, మన వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకొన్ని ఆయా ప్లాట్ ఫామ్ లు సొమ్ము చేసుకుంటుంటాయి. వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి యాప్స్ అన్నీ అంతే. ఇప్పుడు వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ మరింత ప్రమాదకరంగా మారింది. వినియోగదారుల సమాచారాన్ని ఫేస్ బుక్ తో పంచుకుంటామని స్వయంగా వాట్సప్ చెబుతోంది. కొత్త నిబంధనలను ఫిబ్రవరి 8 లోపు అనుమతించకపోతే అకౌంట్ డిలీట్ అవుతుంది.

వాస్తవానికి గతంలో వాట్సప్ విడుదల చేసిన పాత నిబంధనల్లో వినియోగదారుల గోపత్యను గౌరవిస్తామనే హామీ ఇచ్చింది. కానీ తాజా అప్ డేట్స్ లో ఇలాంటి హామీ లేకపోవడం గమనార్హం. ఈ నిబంధనల ప్రకారం వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు ఇతర సంస్థలతో వాట్సప్ షేర్ చేసుకుంటుంది. భారత్‌లో వాట్సాప్‌కు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు వీరందరి వ్యక్తిగత సమాచారాన్ని అధికారికంగానే తస్కరించాలనుకుంటోంది వాట్సప్.

వ్యక్తిగత గోప్యతకు సంబంధించి భారత్‌లో పటిష్ఠమైన చట్టాలు లేవు. అందుకే వాట్సప్ లాంటి సంస్థలు ఇక్కడ వినియోగదారుల నుంచి సమాచారాన్ని సేకరించి థర్డ్ పార్టీలకు విక్రయిస్తుంటాయి. చట్టాలు పటిష్టంగా గల దేశాల్లో వినియోగదారుల గోపత్యకు హామీ పడుతూ నిబంధనలు రూపొందిస్తుంది వాట్సప్. నిజానికి వాట్సప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారంపై నిఘాపెట్టిందనే వివాదం గతంలోనూ చర్చకొచ్చింది. 2019లో ఇజ్రాయెల్ సంస్థ పెగాసెస్ వాట్సప్ ద్వారా వేలాది మంది భారతీయులపై నిఘా పెట్టింది. దీంతో ఇప్పుడు మెజార్టీ వినియోగదారులు వాట్సప్ ని వీడడానికి సిద్ధమవుతున్నారు.

First Published:  10 Jan 2021 1:25 AM GMT
Next Story