చంద్రబాబు కోరికను నిమ్మగడ్డ మన్నిస్తారా..?

ప్రతిపక్షనేత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అపవాదు ఉంది. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేసిన దగ్గర్నుంచి ఆయనకు ప్రభుత్వాధినేతలకు పొసగడంలేదు. చివరకు కోర్టు కేసుల వరకు పంచాయతీ వెళ్లింది. తాజాగా.. మరోసారి ప్రభుత్వం ఎన్నికలు వద్దు వద్దంటున్నా నోటిఫికేషన్ అంటూ హడావిడి చేసి, ఎన్నికల కోడ్ అమలులోకి తెచ్చి హంగామా చేశారు నిమ్మగడ్డ.

గతంలో ఎన్నికలు వాయిదా వేసే సమయంలోనే నిమ్మగడ్డ అధికార పక్షంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకగ్రీవాలపై అనుమానం వ్యక్తం చేశారు. పరిధి మీరారంటూ కొంతమంది అధికారులపై వేటు వేశారు. నామినేషన్ల ప్రక్రియను కొంతమంది అడ్డుకున్నారని అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నామినేషన్ల వ్యవహారంపై మరో ప్రతిపాదన కూడా చేశారు. పల్లెటూళ్లలో తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, వారిని నామినేషన్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, కిడ్నాప్ లు చేస్తున్నారని, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించిన బాబు ఆన్ లైన్ నామినేషన్లు అనే ఐడియాని తెరపైకి తెచ్చారు.

తాజాగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో చంద్రబాబు మరోసారి ఆన్ లైన్ నామినేషన్ల వ్యవహారాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్ లోనూ నామినేషన్లు స్వీకరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. పూర్తిగా కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియలో గ్రామ వలంటీర్లకు ఎలాంటి భాగస్వామ్యం కల్పించవద్దని, గతంలో ఎన్నికల విధులకు సిఫార్సు చేసిన అధికారులను తప్పించాలని కోరారు. ఏకగ్రీవాలను రద్దు చేసి అన్ని స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఆన్ లైన్ నామినేషన్ అనే ప్రక్రియ, అది కూడా పంచాయతీ ఎన్నికల విషయంలో అనేది వినడానికి కాస్త వింతగా, విడ్డూరంగా కూడా ఉంది. ఇంకా నయం ఓట్లు కూడా ఆన్ లైన్ లో వేసే వెసులుబాటు ఇవ్వాలని బాబు కోరలేదు అనే సెటైర్లు పడుతున్నాయి. ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేయడానికి అసలు ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడానికి చంద్రబాబు ఆన్ లైన్ నాటకం ఆడుతున్నారని అందరికీ తెలుసు. ఒకవేళ నిజంగానే ఆన్ లైన్ లో నామినేషన్ కి అనుమతిస్తే.. సంబంధం లేని వ్యక్తులని కూడా రంగంలోకి దింపి.. ఎన్నికల ప్రక్రియనే చిందరవందర చేయాలనేది బాబు దూరాలోచన. అందుకే ఎన్నికల కమిషనర్ సాయం కోరారు. మరి చంద్రబాబు కోర్కెను నిమ్మగడ్డ మన్నిస్తారా..? ఈసారి ఆన్ లైన్ నామినేషన్ కి అనుమతిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ బాబు కోర్కె నెరవేరితే.. సామాన్య ప్రజల్లో బాబు-నిమ్మగడ్డ దోస్తీపై ఉన్న అనుమానాలు పటాపంచలైనట్టే లెక్క. ఆన్ లైన్ కి సై అన్నా, కేంద్ర బలగాలను రంగంలోకి దించినా, వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టినా నిమ్మగడ్డ, బాబు జేబులో మనిషనే విషయం మరోసారి రుజువవుతుంది.