పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పాకులాట

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రంలో తిరిగి బలపడేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో సత్తాచాటి పరువు నిలబెట్టుకోవాలనుకుంటోంది. అందుకోసం ఇప్పటి నుంచే దూకుడును పెంచింది. అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తోంది. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. మోదీకి మొగుడిని అవుతానన్న కేసీఆర్ శిఖండిలా మారాడంటూ విమర్శించారు.

తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అధికార పార్టీని ఢీకొనగల సత్తా తమకే ఉందని నిరూపించుకోవాలనుకుంటోంది. అందుకోసం అటు బీజేపీని, ఇటు టీఆర్ఎస్ ను ఏకకాలంలో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, బీజేపీకి టీఆర్ఎస్ లొంగిపోయిందనే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జీవన్ రెడ్డి తాజా వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకున్నారంటూ జీవన్ రెడ్డి విమర్శించారు. రైతు బంధు పథకం పచ్చి మోసమని, పంటకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వ్యవసాయ చట్టాలపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని, కనీస మద్దతు ధర లభిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకుంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో బీజేపీ స్పీడ్ కు సైతం కళ్లెం వేయాలనుకుంటోంది కాంగ్రెస్. బీజేపీ ఒట్టి గాలిబుడగ అని, అది ఏదో ఒకరోజు పేలిపోతుందని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానా రెడ్డి గెలుపు ఖాయం అన్న ఆయన, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు. ప్రజలను మోసం చేసిన బీజేపీకి ఓట్లడిగే హక్కులేదన్నారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాత పీసీసీ అధ్యక్ష నియామకం ఉంటుందని అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు ప్రత్యేకతను సంతరించుకుంది. పీసీసీ రేసులో ఉన్న జీవన్ రెడ్డి ఇప్పటి నుంచే అధికార పార్టీని ఢీకొనే పనిలోపడ్డారు. అటు ప్రచార కమిటీ భాద్యతలు స్వీకరించబోనున్న రేవంత్ రెడ్డి సైతం టీఆర్ఎస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన రాజకీయ వాతావరణంలోకి మరోమారు కాంగ్రెస్ వచ్చిచేరింది. మరి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, పీసీసీ అధ్యక్ష నియామకం తరువాతైనా కాంగ్రెస్ బలంపుంజుకుంటుందో లేదో చూడాలి.