Telugu Global
National

తమిళనాడులో డేటా రాజకీయం..

కాలమాన పరిస్థితులను బట్టి రాజకీయాలు, రాజకీయ నాయకుల ఎన్నికల హామీలు అన్నీ మారిపోతుంటాయి. ఆమధ్య బీహార్ ఎన్నికల సందర్భంగా ఉచిత కరోనా వ్యాక్సిన్ కూడా ఎన్నికల హామీల్లో చేరిపోయే సరికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు తమిళనాట డేటా రాజకీయాలు మొదలయ్యాయి. మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ గృహిణులందరికీ జీతాలిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు, ఉచితంగా ల్యాప్ టాప్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటూ వాగ్దానం చేశారు. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత డేటా […]

తమిళనాడులో డేటా రాజకీయం..
X

కాలమాన పరిస్థితులను బట్టి రాజకీయాలు, రాజకీయ నాయకుల ఎన్నికల హామీలు అన్నీ మారిపోతుంటాయి. ఆమధ్య బీహార్ ఎన్నికల సందర్భంగా ఉచిత కరోనా వ్యాక్సిన్ కూడా ఎన్నికల హామీల్లో చేరిపోయే సరికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు తమిళనాట డేటా రాజకీయాలు మొదలయ్యాయి. మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ గృహిణులందరికీ జీతాలిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు, ఉచితంగా ల్యాప్ టాప్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటూ వాగ్దానం చేశారు. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత డేటా అంటూ ఊరించారు. తాజాగా.. అధికార అన్నా డీఎంకే పార్టీ ఓ అడుగు ముందుకేసి రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉచితంగా రోజుకి 2 జీబీ డేటాను అందించే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లోని దాదాపు 10లక్షల మంది విద్యార్థులకు ఉచిత డేటా కార్డుల పంపిణీ మొదలు పెట్టబోతోంది. ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ పథకం ఉంటుందని చెబుతున్నా.. ఎన్నికల వేళ తాము మళ్లీ అధికారకంలోకి వస్తే దాన్ని కొనసాగిస్తామని, అదే సమయంలో స్కూల్ పిల్లలకు కూడా ఉచిత డేటా పథకాన్ని ప్రవేశ పెడతామని హామీ ఇవ్వబోతున్నారు. అంటే తమిళనాట ఉచిత డేటా హామీలు జోరందుకున్నట్టే చెప్పాలి.

కూడు-గూడు-గుడ్డ.. ఒకప్పుడు ఈ మాట లేకుండా ఎన్నికల ప్రచారాలు జరిగేవి కావు. తరాలు మారాయి, ప్రజాస్వామ్య భారతానికి 73 వసంతాలు దాటాయి.. కానీ ఇప్పటి వరకూ కూడు-గూడు-గుడ్డ కొంతమందికి అందని ద్రాక్షలాగే మిగిలాయి. కారణాలేవైనా.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హామీ అది. అయితే కాలక్రమంలో కూడు-గూడు లేకపోయినా.. మిగతా వాటిపై జనాల్లో ఆశ పెరిగింది. అందుకే ఉచిత కలర్ టీవీలు, గ్రైండర్లకి కూడా ఓట్లు పడ్డాయి. అంటే.. ఇళ్లు ఇస్తామనే హామీ బాగా రొటీన్, కొన్నాళ్ల క్రితం కలర్ టీవీ అనే హామీ కాస్త మోడ్రన్, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ల్యాప్ ట్యాప్, ఉచిత డేటా.. అనేదే ఇప్పుడు ట్రెండ్. ఆల్రడీ కమల్ హాసన్ డేటా రాజకీయాలు మొదలు పెడితే.. అన్నా డీఎంకే దాన్ని అమలులో పెట్టి కాలేజీ విద్యార్థుల మనసు గెలుచుకుంది. ఇక డీఎంకే, బీజేపీ మేనిఫెస్టోలు రెడీ అయితే.. ఎవరెవరు ఎంతెంత డేటాను ఉచితంగా ఇస్తారనే విషయంపై ఓ క్లారిటీ వస్తుంది. డేటా యుద్ధం కంపెనీల మధ్యే కాదు, రాజకీయ పార్టీల మధ్య కూడా అనే విషయం ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.

First Published:  10 Jan 2021 9:28 PM GMT
Next Story