Telugu Global
Others

కమిటీ ఏర్పాటు చేస్తామన్న కోర్టు... అక్కరలేదంటున్న రైతులు

సర్వోన్నత న్యాయస్థానం అన్నంత పనిచేసింది. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు, చట్టాలను నిలిపివేస్తారా లేదా? అంటూ నిన్న ప్రశ్నించింది. లేదంటే మేమే ఆ పని చేస్తామంటూ హెచ్చరించింది. ఈ రోజు అన్నట్లుగానే నూతన వ్యవసాయ చట్టాలపై కోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు […]

కమిటీ ఏర్పాటు చేస్తామన్న కోర్టు... అక్కరలేదంటున్న రైతులు
X

సర్వోన్నత న్యాయస్థానం అన్నంత పనిచేసింది. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు, చట్టాలను నిలిపివేస్తారా లేదా? అంటూ నిన్న ప్రశ్నించింది. లేదంటే మేమే ఆ పని చేస్తామంటూ హెచ్చరించింది. ఈ రోజు అన్నట్లుగానే నూతన వ్యవసాయ చట్టాలపై కోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది. కమిటీ ధర్మాసనానికి నివేదికను అందిస్తుందని స్పష్టం చేసింది.

నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. రైతుల సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకుంటామంది కోర్టు. కమిటీని ఏర్పాటు చేసేందుకు తమకు అధికారం ఉందన్న కోర్టు, చట్టాలను నిలిపివేసే హక్కు కూడా తమకు ఉందని స్పష్టం చేసింది. అవసరమైతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామంది.

వ్యవసాయ చట్టాల విషయంలో పరిష్కారం కోరుకుంటున్న వారంతా కమిటీని సంప్రదించాలని కోర్టు సూచించింది. రైతులు సైతం తమ అభిప్రాయాలను కమిటీ ముందుంచాలని సూచించింది. కాగా.. రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరని వారి తరఫున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రైతుల తరుపు న్యాయవాది వాదనపై స్పందించిన కోర్టు అలాంటి మాటలు వినడానికి తాము సిద్ధంగా లేమని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్య పరిష్కారం కావాలంటే అభిప్రాయాలు కమిటీ ముందుంచాల్సిందే అని స్పష్టం చేసింది ధర్మాసనం.

కాగా… రైతు సంఘాలు మాత్రం కోర్టు అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం వైఖరిలో మార్పు రాకుండా కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదని, అలాంటప్పుడు కమిటీల వల్ల కాలయాపన తప్ప మరే ప్రయోజనం ఉండదని రైతులు సంఘాలు అంటున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం మినహా మరే ప్రత్యామ్నాయాన్ని తాము అంగీకరించబోమని రైతులు స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో వ్యవసాయ చట్టాల వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి.

First Published:  12 Jan 2021 4:03 AM GMT
Next Story