అభివృద్ధి చేశాను.. క్షమించండి. బాబు కామెడీ..

రైతు జపం మధ్యలో ఆపేసి.. అనుకోకుండా రామ జపం చేసిన చంద్రబాబు.. రామతీర్థం ఘటనతో లాభం లేదనుకుని తిరిగి రైతు జపం మొదలు పెట్టారు. రైతు వ్యతిరేక జీవోలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన ఆయన.. జీవో ప్రతుల్ని భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో చలికి వణికిపోతున్న రైతుల గురించి పల్లెత్తు మాట మాట్లాడటానికి సాహసించని బాబు.. రాష్ట్రంలో రైతుల తరపున ఎవరూ గొంతెత్తకుండానే తాను ఉద్యమనాయకుడిలా మారిపోయారు. ఇన్నాళ్లూ రైతులంటే కేవలం అమరావతి రైతులు మాత్రమే అన్నట్టు.. రాజధాని సబ్జెక్ట్ ని భుజానపెట్టుకుని తిరిగిన బాబు.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్త రైతుల తరపున పోరాడతానని చెబుతున్నారు.

అభివృద్ధి చేశాను.. క్షమించండి..
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన తప్పయితే తనను ప్రజలు క్షమించాలని కోరారు చంద్రబాబు. నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తన పార్టీని ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్థం కాలేదంటున్న బాబు.. ఆ ఓటమిని మరోసారి గుర్తు చేసుకుని మథనపడ్డారు. జగన్‌ నాటకాలు నమ్మి జనం పూనకం వచ్చినట్టు ఓట్లేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేం తప్పు చేశానో తెలీదన్న చంద్రబాబు.. ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశానని, అదే తాను చేసిన తప్పయితే క్షమించాలని చెప్పారు. నిజంగానే బాబు చేసిన అభివృద్ధిని చూడకపోవడం ప్రజల తప్పే అయితే.. వారి మనసు మార్చాలనుకోవడం మరీ మూర్ఖత్వం అవుతుంది. ఎవరు ఎలాంటి పాలన అందించారు, అందిస్తున్నారు అని బేరీజు వేసుకోవడంలో ఓటర్లను మించినవారు ఇంకెవరూ లేరు. ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ చూపించారు కానీ, అసలైన అభివృద్ధి జరగలేదనేది మెజార్టీ వర్గం అభిప్రాయం. పోలవరం గడువుల్ని పొడిగించుకుంటూ పోయారు, రైతు రుణమాఫీ బకాయిలు అలాగే ఉన్నాయి, అధికారంలో ఉన్నన్ని రోజులు ఉద్యోగాలు భర్తీ చేయలేదు, తీరా దిగిపోయే సమయంలో నిరుద్యోగ భృతి అన్నారు.. ఇలాంటి అవకతవకల వల్లే బాబు 23 దగ్గరే ఆగిపోయారు. అయితే ఇవేవీ తనకు తెలియనట్టు, తాను చేసిన అభివృద్ధే ప్రజలకు తెలియలేదన్నట్టు మాట్లాడుతున్నారు. తీరా ఇప్పుడు అభివృద్ధి చేశాను.. క్షమించండి అంటూ ప్రజలపైనే సెటైర్లు వేస్తున్నారు.

అమరావతి అంశం ఓ ప్రాంతానికి, రామతీర్థం విషయం ఓ మతానికి మాత్రమే పరిమితం కావడంతో.. యూనివర్సల్ సబ్జెక్ట్ కోసం తిరిగి రైతుల వద్దకే వచ్చారు చంద్రబాబు. రైతుల తరపున పోరాటం అంటూ భోగిమంటల రాజకీయం మొదలు పెట్టారు.