వాతలు పెట్టడానికి సిద్ధమవుతున్న మోదీ..

నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేయడంలో కొంతమంది సిద్ధహస్తులు. సరిగ్గా అలాగే.. ప్రజలకు నొప్పి తెలియకుండా పన్నుల వాత పెట్టి, దానిపై ఆయింట్ మెంట్ రాయడంలో ప్రధాని మోదీ చేయి తిరిగిన నాయకుడు. అలాంటి మోదీ కరోనా కష్టకాలంలో సామాన్యులను ఊరికే వదిలిపెడతారని ఎవరూ ఊహించరు. ఎన్డీఏ వ్యవహారం తెలిసినవారెవరైనా కరోనా బడ్జెట్ లో మోదీ విశ్వరూపం చూపెడతారనే అనుకుంటారు. అలాంటి భయాందోళనల మధ్యే 20021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సిద్ధమవుతోంది. అందులో ప్రత్యేకత కొవిడ్ సెస్ అనే ప్రచారం మారుమోగుతోంది.

ఇప్పటికే కొవిడ్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల కోసం బడ్జెట్ కేటాయింపులు మళ్లించేశారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా చేపట్టబోతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కి కూడా భారీ స్థాయిలో ఖర్చు అవుతుంది. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. అందుకే కొవిడ్ సెస్ తెరపైకి వచ్చింది.

జీఎస్టీ వసూళ్ల విషయంలో కేంద్రం పనితనం ఏంటో రాష్ట్రాలకు బాగా తెలిసొచ్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక మోత మోగిపోయింది. అంతర్జాతీయంగా రేట్లు భారీగా పతనమైన సమయంలో కూడా సగటు భారతీయుడు సైలెంట్ గా చేతి చమురు వదిలించుకున్నాడు. గ్యాస్ సబ్సిడీ ఎంతమందికి పడుతుందో, ఎంత పడుతుందో కూడా తెలియని పరిస్థితి. సబ్సిడీ గురించి ఆలోచించకుండానే లేకుండానే గ్యాస్ సిలిండర్ కొనుక్కోడానికి దాదాపుగా జనం అలవాటు పడిపోయారు. ఏమీ లేనప్పుడే ఇలాంటి షాకులిచ్చిన మోదీ.. కరోనా కష్టం కళ్లముందు ఉంటే జనాల్ని ఊరికే వదిలేస్తారా. కొవిడ్ సెస్ భారీ స్థాయిలోనే ఉంటుందని, దేశంలోని ప్రతి ఒక్కరిపై ఆ భారం పడుతుందని అంటున్నారు. ఒకవేళ ఉన్నతాదాయ వర్గాలపైనే కొవిడ్ సెస్ విధించినా కూడా.. అది అందరిపై ప్రభావాన్ని చూపుతుందనడంలో అనుమానం లేదు.

అయితే ఏ రూపంలో కొవిడ్ సెస్ ని వడ్డిస్తారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొవిడ్ వ్యాక్సినేషన్, కొవిడ్ నివారణ చర్యలకు భారీగా బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాల్సి వచ్చిందని, ఆ లోటు పూడ్చుకోడానికి, ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు పన్నుల వాత తప్పడంలేదనేది కేంద్రం వాదనగా మనం వినొచ్చు. ప్రజలకోసమే ఇదంతా అని ఓ సెంటిమెంట్ డైలాగు కొట్టేసి, కొవిడ్ సెస్ పై ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. అందుకే ముందుగానే మీడియాకు లీకులిచ్చేసి కొవిడ్ సెస్‌కు జనాల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు.