నిమ్మగడ్డకు మళ్లీ చుక్కెదురు..! అత్యవసర విచారణ అవసరం లేదన్న కోర్టు.!

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కొంతకాలంగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​ ఆఘమేఘాల మీద స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల చేశారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికల నిర్వహణ కుదరదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అయినప్పటికీ నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

అయితే ఈ విషయంపై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా ఎన్నికల షెడ్యూల్​ను కోర్టు కొట్టేసింది. దీంతో నిమ్మగడ్డ రమేశ్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ డివిజన్​ బెంచ్​లో పిటిషన్​ దాఖలు చేశారు. అయితే అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన అప్పీల్​ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్​ వేసిన అప్పీల్​ను తక్షణం విచారించకపోతే న్యాయపరమైన చిక్కులు ఏమీ లేవని కోర్టు తేల్చిచెప్పింది. విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.

జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సోమవారం రాత్రి హౌస్‌ మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం సాయంత్రం ఆయన ఇంటి వద్ద విచారణ జరిపింది. ఎన్నికల కమిషన్‌ తరపున ఎన్‌. అశ్వనీ కుమార్‌.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.

‘ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోవద్దని ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఇవన్నీ 18న రెగ్యులర్‌ బెంచ్‌ ముందు చెప్పుకోవాలంటూ ధర్మాసనం పేర్కొన్నది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం 18 వ తేదీకి విచారణ వాయిదా వేసింది.