Telugu Global
Others

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సినే కావాలంటున్న వైఎస్ జగన్

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభంకానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ శాస్త్రీయ నిర్ధారణపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రెండు కోవిడ్-19 వ్యాక్సీన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తుండగా, కోవ్యాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ సంస్థ తయారుచేస్తోంది. ఈ రెండు టీకాల అత్యవసర వినియోగానికి కేంద్రం ముందుకు వచ్చింది. కాగా… ఇప్పుడు వీటి సామర్థ్యంపై సందేహాలు […]

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సినే కావాలంటున్న వైఎస్ జగన్
X

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభంకానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ శాస్త్రీయ నిర్ధారణపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రెండు కోవిడ్-19 వ్యాక్సీన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తుండగా, కోవ్యాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ సంస్థ తయారుచేస్తోంది. ఈ రెండు టీకాల అత్యవసర వినియోగానికి కేంద్రం ముందుకు వచ్చింది. కాగా… ఇప్పుడు వీటి సామర్థ్యంపై సందేహాలు వెల్లువెత్తున్నాయి.

భారత దేశంతో పాటు వేరు వేరు దేశాల్లో తయారవుతున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, బయోఎన్‌టెక్, మోడెర్నా వ్యాక్సీన్ల మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ 70 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కానీ భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్ డేటా మాత్రం ఇప్పటి వరకూ వెల్లడికాలేదు. అయినా… కేంద్రం ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం తెలపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ నవంబర్ మధ్యలోనే ప్రారంభమయ్యాయని జనవరి 2న భారత్ బయోటెక్ ప్రకటించింది. మూడోదశ ప్రయోగాల కోసం 23 వేల మంది వాలెంటీర్లు ముందుకు వచ్చారని, మొత్తం 26వేల మందికి టీకా ఇవ్వడమే తమ లక్ష్యమని ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దాని పర్యవసానాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ మూడో దశ ట్రయిల్స్ పూర్తికాకముందే కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం ఆమోదించింది. కేంద్రం నిర్ణయం పట్ల ప్రతి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అనుమతులు ఇవ్వడం ప్రమాదకరమని శశిథరూర్, జయరాం రమేష్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ అన్నారు.

తాజాగా వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం అందిస్తున్న వ్యాక్సిన్ ల శాస్త్రీయ నిర్ధారణకు గల ఆధారాలేంటని మమతా బెనర్జీ ప్రశ్నించారు. టీకాల వినియోగానికి ముందు అన్ని పరిశోధనలూ పూర్తయినట్లు తగిన ఆధారాలు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. టీకాలు తీసుకున్న తరువాత ఎలాంటి ప్రభావం ఉంటుందో కూడా వెల్లడించాల్సిన అవసరముందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం కేంద్రం అనుమతించిన రెండు టీకాలూ పూర్తి సురక్షితమైనవని శాస్త్రీయ ఆధారాలు చూపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మూడో దశ ట్రయల్స్ పూర్తికాకుండా వాటి ఫలితాలు వెల్లడికాకుండా టీకాలను వినియోగించడం సరైందికాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు… రాష్ట్రంలో ప్రజలకు శాస్త్రీయంగా నిరూపితమైన వ్యాక్సిన్ ను మాత్రమే అందించాలని అధికారులను అదేశించినట్లు తెలుస్తోంది. కోవ్యాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ డేటా వెల్లడికానందున రాష్ట్రప్రభుత్వం ఆక్స్ ఫర్డ్ రూపొందించిన వ్యాక్సిన్ వినియోగానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

First Published:  14 Jan 2021 9:44 AM GMT
Next Story