Telugu Global
National

ప్రజారోగ్యంతో ఈ ఆటలేమిటి మోదీ?

ఓ వస్తువు నాణ్యతపై భరోసా ఉంది, పైగా రేటు తక్కువ. మరో వస్తువు నాణ్యత గురించి పూర్తిగా తెలియదు, పైగా రేటెక్కువ. ఇలాంటి సమయంలో ఎవరైనా దేన్ని ఎంపిక చేసుకుంటారు. తక్కువ ధరలో ఎక్కువ నాణ్యత కలిగిన వస్తువునే కొనుక్కుంటారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ధర ఎక్కువైనా, దాని సామర్థ్యం గురించి తెలియకపోయినా రెండో వస్తువువైపే మొగ్గు చూపింది. కారణం ఏంటి? శాస్త్రవేత్తలకు అంతు చిక్కడంలేదు, ఆర్థిక వేత్తలకు మింగుడు పడటంలేదు, ఇక సామాన్యులకు ఆ […]

ప్రజారోగ్యంతో ఈ ఆటలేమిటి మోదీ?
X

ఓ వస్తువు నాణ్యతపై భరోసా ఉంది, పైగా రేటు తక్కువ. మరో వస్తువు నాణ్యత గురించి పూర్తిగా తెలియదు, పైగా రేటెక్కువ. ఇలాంటి సమయంలో ఎవరైనా దేన్ని ఎంపిక చేసుకుంటారు. తక్కువ ధరలో ఎక్కువ నాణ్యత కలిగిన వస్తువునే కొనుక్కుంటారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ధర ఎక్కువైనా, దాని సామర్థ్యం గురించి తెలియకపోయినా రెండో వస్తువువైపే మొగ్గు చూపింది. కారణం ఏంటి? శాస్త్రవేత్తలకు అంతు చిక్కడంలేదు, ఆర్థిక వేత్తలకు మింగుడు పడటంలేదు, ఇక సామాన్యులకు ఆ విషయంపై అంత అవగాహన లేదు. సీరం ఇన్ స్టిట్యూట్ వద్ద కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను భారత ప్రభుత్వం 200 రూపాయలకు కొనుగోలు చేస్తోంది. అదే కొవాక్సిన్ ను భారత్ బయోటెక్ వద్ద 295 రూపాయలకు కొనుగోలు చేస్తోంది. భారత కంపెనీ కాబట్టి.. కొన్ని డోసులను భారత్ లో ఉచితంగా ఇవ్వడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. అలా ఉచితంగా ఇచ్చే వ్యాక్సిన్ ని కూడా లెక్కలో వేసుకుంటే చివరిగా కొవాక్సిన్ ధర 206 రూపాయలు. అలా చూసుకున్నా కొవిషీల్డ్ కంటే అది 6 రూపాయలు ఎక్కువ. పోనీ ధర తక్కువైనా నాణ్యత బాగుంది అనుకోడానికి లేదు. కొవాక్సిన్ ఇంకా మూడో దశ ప్రయోగాలు పూర్తి చేసుకోలేదు. అలాంటి టైమ్ లో హడావిడిగా భారత ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతివ్వడమే కాకుండా 30,85,00 డోసుల్ని కొనుగోలు చేసింది. దీనిపై ఇప్పటికే రాజకీయ దుమారం రేగింది. పోనీ రాజకీయాలను పక్కనపెట్టినా ఏ లాజిక్ ప్రకారం భారత ప్రభుత్వం కొవాక్సిన్ వైపు మొగ్గు చూపిందనే విషయం తేలడంలేదు.

బ్యాకప్ వ్యాక్సిన్..
భారత్ లాంటి అత్యథిక జనాభాగల దేశాల్లో కేవలం ఒకే ఒక్క వ్యాక్సిన్ ని, ఒకే ఒక్క సంస్థని నమ్ముకుని టీకా ప్రక్రియను ప్రారంభించలేం, అందుకే రెండో టీకాకు అనుమతినిచ్చాం అని క్లారిటీ ఇచ్చారు ఢిల్లీ ఎయిమ్స్ అధినేత రణదీప్ గులేరియా. ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ మాటల్లో చెప్పాలంటే.. “లబ్ధిదారులనుంచి అనుమతి పత్రం తీసుకున్న తర్వాతే కొవాక్సిన్ ను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అలా తీసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో లేదో తెలుసుకోడానికి వారిపై పర్యవేక్షణ ఉంటుంది.” అంటే ఒకరకంగా కొవాక్సిన్ ని భారత్ బ్యాకప్ వ్యాక్సిన్ గా మాత్రమే ఉపయోగిస్తుందనమాట.

ఎవరికి ఏ టీకా..?
తొలి దశ వ్యాక్సినేషన్ కోసం భారత ప్రభుత్వం కోటీ 10లక్షల డోసులు కొవిషీల్డ్ టీకా కొనుగోలు చేసింది. కాని కొవాక్సిన్ టీకాలు మాత్రం కేవలం 55లక్షలు మాత్రమే కొనుగోలు చేశారు. మరి పంపిణీలో ఎవరికి ఏ టీకా వేస్తారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. అయితే హెల్త్ వర్కర్లు తమకు ఉచితంగా వేసే వ్యాక్సినేషన్ విషయంలో ఏ టీకా కావాలో ఎంపిక చేసుకోలేరని, ఇప్పటి వరకూ విదేశాల్లో కూడా అలాంటి ఛాయిస్ ఇవ్వలేదని అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.

ఎప్పటివరకు ఈ వ్యాక్సినేషన్..?
వ్యాక్సినేషన్ మొదలైతే భారత్ లో ప్రతి రోజూ 3లక్షలమందికి వ్యాక్సినేషన్ వేయాలనేది ప్రభుత్వం టార్గెట్. తొలి దశలో అలా 3కోట్లమంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయబోతున్నారు. దీనికి అనుగుణంగా సీరమ్ ఇన్ స్టిట్యూట్ టీకాలు తయారు చేసి, సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సీరం సంస్థ దగ్గర 5కోట్ల డోసులు స్టాక్ ఉంది. మార్చి లోగా మరో 10కోట్ల డోసులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది కూడా. భారత్ లో టీకా నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉంది.

మేకిన్ ఇండియాలో భాగంగా..
భారత్ లో తయారీ అనే అంశాన్ని ప్రోత్సహించేందుకే భారత్ బయోటెక్ సంస్థకు అనుమతులిచ్చారనే వాదన కూడా వినిపిస్తోంది. సీరమ్ సంస్థ భారత్ కి చెందినదే అయినా.. ఆ సంస్థ తయారు చేసే కొవిషీల్డ్ ఫార్ములా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థలకు చెందినది. అందుకే పూర్తి భారత్ తయారీ కొవాక్సిన్ కి కేంద్రం మద్దతు తెలుపుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఇలాంటి రిస్క్ చేయడం అవసరమా అనేవారు కూడా ఉన్నారు.

మాకు కొవాక్సిన్ వద్దే వద్దు..
ఇప్పటికే బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలు కొవాక్సిన్ పై విముఖత చూపిస్తున్నాయి. కేంద్రంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం జగన్.. కొవాక్సిన్ హడావిడి అనుమతిపై కాస్త గట్టిగానే ప్రశ్నించారు కూడా. ఇక చత్తీస్ ఘడ్ ప్రభుత్వం కొవాక్సిన్ తమకు వద్దని కరాఖండిగా కేంద్రానికి చెప్పేసింది. దీనికి తగ్గట్టే… కేంద్రం తమకు కొవిషీల్డ్ టీకాలు మాత్రమే సరఫరా చేస్తామని చెప్పిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ తెలిపారు.

First Published:  15 Jan 2021 8:18 AM GMT
Next Story