మళ్లీ తెరమీదకు అన్నా హజారే

అవినీతిపై సమరం పేరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోమారు తెరమీదకు వచ్చారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రైతు సమస్యలపై నెలాఖరులో నిరాహార దీక్ష ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు లోబడి లేవని విమర్శించిన ఆయన, చట్టాల రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. తన జీవితంలో చివరి నిరాహార దీక్షను రైతుల కోసమే చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

గాంధేయ వాది అన్నా హాజారే అవినీతి రహిత లోక్ పాల్ చట్టం కోసం నిరాహార దీక్ష చేపట్టి దేశం మొత్తాన్ని కదిలించారు. ఆయన సామాజిక సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇప్పుడాయన రైతుల పక్షాన గళమెత్తనున్నారు. దాదాపు 50 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన నెలకొంది. నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించినప్పటికీ రైతులు సంతృప్తిగా లేరు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ముందు రావడానికి రైతులు ససేమిరా అంటున్నారు.

ఇప్పటికే సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీలోంచి భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు భుపిందర్‌ సింగ్‌ మాన్ తప్పుకున్నారు. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సభ్యులంతా వ్యవసాయ చట్టాలను సమర్థించే వారే అంటూ రైతు సంఘాలు ఆరోపించిన నేపథ్యంలో భూపిందర్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను నిష్పాక్షికంగా ఉండాలనుకుంటున్నానని, ప్రజల మనోభావాల కారణంగా కమిటీ నుంచి తప్పు కుంటున్నానని తెలిపారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని, తానెప్పుడూ రైతులు, పంజాబ్‌ పక్షానే ఉంటానని అన్నారు.

ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా అన్నాహజారే లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డిసెంబరు 14న కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు సైతం అన్నా హజారే లేఖరాశారు. స్వామినాథన్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయాలని, వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ కు స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలని కోరారు. లేదంటే తాను నిరహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై ఇప్పటికి తాను ఐదు సార్లు కేంద్రానికి లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి రాసిన లేఖలో తన జీవితంలో చివరి నిరహార దీక్షను రైతుల కోసం చేయబోతున్నట్లు తెలిపారు.

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరహార దీక్షకు అనుమతి కోరుతూ అధికారులకు సైతం లేఖ రాసినట్లు పేర్కొన్నారు. 2011లో అవినీతి వ్యతిరేక ఆందోళనలో భాగంగా ఆయన రామ్‌లీలా మైదానంలో చేపట్టిన నిరహార దీక్ష చరిత్ర సృష్టించింది. దేశం దేశమంతా ఆయనకు మద్దతు పలికింది. భారీగా యువత అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగమైంది. ఇప్పుడు మళ్లీ అన్నాహజారే తన నిరాహార దీక్షకు రామ్ లీలా మైదానాన్నే ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి అన్నాహజారే లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ఇవాళ రైతులతో కేంద్రం తొమ్మిదో విడత చర్చలు జరపనుంది.