Telugu Global
International

ట్రంప్ ని వెంటాడుతున్న పాపం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఖరి దశలో ఘోర అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష పదవిని వీడడానికి సిద్ధంగా లేని ఆయన జో బైడెన్ గెలుపును అంగీకరించకుండా నానా యాగీ చేసి నవ్వులపాలయ్యారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ను యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన వేళ కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడి పెద్ద దుమారమే లేపింది. ఏకంగా గడువుకు ముందే పదవి నుంచి తప్పుకోవల్సిన దుస్థితి దాపురించింది. ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసనను ప్రతినిధుల […]

ట్రంప్ ని వెంటాడుతున్న పాపం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఖరి దశలో ఘోర అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష పదవిని వీడడానికి సిద్ధంగా లేని ఆయన జో బైడెన్ గెలుపును అంగీకరించకుండా నానా యాగీ చేసి నవ్వులపాలయ్యారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ను యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన వేళ కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడి పెద్ద దుమారమే లేపింది. ఏకంగా గడువుకు ముందే పదవి నుంచి తప్పుకోవల్సిన దుస్థితి దాపురించింది. ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసనను ప్రతినిధుల సభ ఆమోదించింది. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు ఎదుర్కొన్న అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు.

ఓ వైపు ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగానే మరోవైపు సామాజిక మాద్యమాలన్నీ ట్రంప్ పై వేటు వేస్తున్నాయి. కేపిటల్ భవనం దాడి సందర్భంగా ట్రంప్ చేసిన పోస్టులు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ట్విట్టర్ ఆయన అకౌంట్ ను శాశ్వంతంగా తొలగించింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సైతం 20వ తేదీ వరకు ఆయన అకౌంట్లను బ్లాక్ చేశాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి స్నాప్ చాట్ కూడా చేరింది. స్నాప్ చాట్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కేపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు స్నాప్ చాట్ వెల్లడించింది.

రెండు రోజుల క్రితమే యూట్యూబ్ సైతం ట్రంప్ కి షాక్ ఇచ్చింది. తాను పోస్ట్ చేసిన కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ డిలీట్ చేసింది. జనవరి 20న జో బైడెన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ట్రంప్ దేశంలో అశాంతిని రేకెత్తించే అవకాశం ఉందని, అందువల్లే అతడి అకౌంట్ ను బ్యాన్ చేస్తున్నట్లు స్నాప్ చాట్ తెలిపింది. సామాజిక మాద్యమాలు ఒక్కొక్కటి కొరడా జులిపిస్తుండడంతో ట్రంప్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.

మరోవైపు సామాజిక మాద్యమాలు ట్రంప్ అకౌంట్స్ పై నిషేధం విధించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అమెజాన్, యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్, ట్విటర్ సంస్థలు ట్రంప్ అకౌంట్లను ఎందుకు నిషేధించాయో వివరణ ఇవ్వాలని టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ ప్యాక్స్టన్ డిమాండ్ చేశారు. సామాజిక మాద్యమాలు ట్రంప్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అకారణంగా ఆయన ఖాతాలను తొలగించాయన్నారు.

కేపిటల్ భవనంపై దాడి వ్యవహారం ట్రంప్ మెడకు ఉచ్చులా మారింది. సొంత పార్టీ నుంచే వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. ట్రంప్ ను పదవి నుంచి తప్పించేందుకు ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానం 232-197 తేడాతో ఆమోదం పొందడే అందుకు నిదర్శనం. ప్రతినిధుల సభ ఆమోదించిన తీర్మానాన్ని సెనేట్‌కు పంపిస్తారు. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవల్సిందే. కాగా… సెనేట్‌ ఈ నెల 19 వరకు వాయిదా పడింది. మొత్తానికి ట్రంప్ చేజేతులారా తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పరాభవం తరువాతైనా ట్రంప్ తీరు మారుతుందో లేదో చూడాలి.

First Published:  14 Jan 2021 4:02 PM GMT
Next Story