Telugu Global
NEWS

పథకం ప్రకారమే ఆలయాలపై దాడి

తీగ లాగితే డొంక కదిలినట్లు విగ్రహల విధ్వంసం వెనక కుట్ర బట్టబయలవుతోంది. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ఆలయాలపై జరుగుతున్న దాడులను పోలీసులు చేధించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రతిపక్ష నేతలే ఆలయాలపై దాడులకు పాల్పడ్డారంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. పలు ఆలయాలపై జరిగిన దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందని స్పష్టం చేశారు. దాడుల వెనక 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల ప్రమేయాన్ని గుర్తించామని, ఇప్పటి వరకు 13 మంది టీడీపీ […]

పథకం ప్రకారమే ఆలయాలపై దాడి
X

తీగ లాగితే డొంక కదిలినట్లు విగ్రహల విధ్వంసం వెనక కుట్ర బట్టబయలవుతోంది. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ఆలయాలపై జరుగుతున్న దాడులను పోలీసులు చేధించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రతిపక్ష నేతలే ఆలయాలపై దాడులకు పాల్పడ్డారంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. పలు ఆలయాలపై జరిగిన దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందని స్పష్టం చేశారు. దాడుల వెనక 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల ప్రమేయాన్ని గుర్తించామని, ఇప్పటి వరకు 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్టు చేశామని వెల్లడించారు.

గత నెలరోజుల్లో రాష్ట్రంలో ఐదు విగ్రహ విధ్వంసం కేసులు నమోదయ్యాయి. కాగా వీటిలో మూడు ఘటనల్లో టీడీపీ నేతల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా కొసిగి మండలం సజ్జలగూడెం ఆంజనేయస్వామి ఆలయం, ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామం లక్ష్మీనరసింహాస్వామి ఆలయంపై దాడి ఘటనల్లో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హిందూ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అధికార పార్టీని హిందూ వ్యతిరేక పార్టీగా ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నాయి. ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులను సాకుగా చూపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా.. విగ్రహాల విధ్వంసం వెనక ప్రతిపక్షాలే ఉండడం గమనార్హం. దొంగే దొంగ అన్నట్లు… తామే విగ్రహాలను ధ్వంసం చేసి, తిరిగి తామే ఆందోళనలు చేపట్టడం చూస్తుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

పథకం ప్రకారమే ప్రతిపక్షాలు విగ్రహాల విధ్వంసానికి పాల్పడినట్లు స్వయంగా రాష్ట్ర డీజీపీయే ప్రకటించడం గమనార్హం. ఆలయాలపై దాడుల వెనక టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయముందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇప్పటి వరకూ ఆలయాలపై దాడుల కేసుల్లో 335 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆలయాల భద్రత కోసం 23,256 గ్రామాల్లో 15,394 గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 58,871 ఆలయాలను జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. నిరంతర పర్యవేక్షణ కోసం 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఆలయాలపై దాడులను సాకుగా చూపి కొందరు సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయాలపై దాడులను రాజకీయం చేయొద్దని ఆయన పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే సహించబోమన్నారు. మొత్తానికి విగ్రహాల విధ్వంసాన్ని సాకుగా చూపి నానా రాద్ధాంతం చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడేమంటాయో చూడాలి మరి.

First Published:  16 Jan 2021 7:45 AM GMT
Next Story