Telugu Global
NEWS

వ్యవస్థలతో యుద్ధం టీడీపీకి లాభమా నష్టమా..?

ఏపీలో పంచాయతీ ఎన్నికలు పెడితే.. వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా ఉంచాలని ఆమధ్య డిమాండ్ చేశారు చంద్రబాబు. పలు శాఖల ఉన్నతోద్యోగులు ప్రభుత్వానికి తొత్తుల్లా మారారంటూ ఆయన ధ్వజమెత్తిన ఉదాహరణలూ ఉన్నాయి. తాజాగా పోలీస్ డిపార్ట్ మెంట్ ని, ముఖ్యంగా పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ని టీడీపీ సీరియస్ గా టార్గెట్ చేసింది. ఆయన ఐపీఎస్ అధికారి కాదని, వైపీఎస్ అధికారి అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు నేతలు. తాడేపల్లి కొంపలో వైఎస్ జగన్ […]

వ్యవస్థలతో యుద్ధం టీడీపీకి లాభమా నష్టమా..?
X

ఏపీలో పంచాయతీ ఎన్నికలు పెడితే.. వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా ఉంచాలని ఆమధ్య డిమాండ్ చేశారు చంద్రబాబు. పలు శాఖల ఉన్నతోద్యోగులు ప్రభుత్వానికి తొత్తుల్లా మారారంటూ ఆయన ధ్వజమెత్తిన ఉదాహరణలూ ఉన్నాయి. తాజాగా పోలీస్ డిపార్ట్ మెంట్ ని, ముఖ్యంగా పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ని టీడీపీ సీరియస్ గా టార్గెట్ చేసింది. ఆయన ఐపీఎస్ అధికారి కాదని, వైపీఎస్ అధికారి అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు నేతలు. తాడేపల్లి కొంపలో వైఎస్ జగన్ మార్కు భోగిపళ్లు డీజీపీపై పోశారని, అందుకే ఆయన ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులపై కేసులు పెడుతున్నారని, ఆలయాల ఘటనలో రాజకీయ కోణం ఉందంటున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. మొత్తంగా పోలీస్ డిపార్ట్ మెంట్ తో తాడో పేడో తేల్చుకోడానికే ప్రతిపక్షం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ సహా.. పలువురు ఉన్నతాధికారుల్ని ఎలా తనకు అనుకూలంగా మార్చుకున్నారో, అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేతలను ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయని బాబు ఊహించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. అదే సమయంలో ఆలయాల ఘటనపై రాజకీయ కోణం ఉందని ఆరోపించిన డీజీపీని నేరుగా వివాదాల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం? అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్ర నుంచి ఇప్పటి అఖిల ప్రియ వరకూ.. ఏ టీడీపీ నేత కూడా కారణం లేకుండా అరెస్ట్ కాలేదు. బలమైన కారణాలు, అందులోనూ కిడ్నాప్, హత్యాయత్నాల వంటి సీరియస్ క్రైమ్ లతో కూడా టీడీపీ నేతలకు సంబంధాలున్నాయని తేలడం వల్లే వారు కటకటాలు లెక్కబెట్టాల్సి వచ్చింది. అలాంటి వాటికి కూడా (అఖిల ప్రియ మినహాయింపు) పోలీసులను బాధ్యుల్ని చేసి దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసం.

ఇక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష నోటిఫికేషన్ పై పలు ఉద్యోగ సంఘాలు బాహాటంగానే మండిపడ్డాయి. కరోనా కష్టకాలంలో, అందులోనూ వ్యాక్సినేషన్ కు సమయం ముంచుకొచ్చిన దశలో ఎన్నికల విధులతో తమ ఆరోగ్యాలతో చెలగాటం ఆడొద్దని హితవు పలికాయి. నిమ్మగడ్డ వెనక చంద్రబాబు ఉన్నారనేది బహిరంగ రహస్యమే కాబట్టి.. పరోక్షంగా ఉద్యోగ సంఘాలు చంద్రబాబుతో కూడా విభేదించినట్టే చెప్పాలి. తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ చేసిన వ్యాఖ్యలను ఏపీ పోలీస్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. గతంలోనూ ఉద్యోగ సంఘాలు చంద్రబాబు వైఖరితో నొచ్చుకున్నాయి, ఇప్పుడది బహిరంగ విమర్శలకు సైతం దారి తీస్తోంది.

వ్యవస్థల్లోకి రాజకీయాలు చొచ్చుకుని రావడం చంద్రబాబుతోనే మొదలైందనే అపవాదు ఉంది, నేడు అదే సాకుతో అధికార పక్షాన్ని ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేరుగా ఉన్నతోద్యోగులకు సైతం కులం, మతాన్ని అంటగడుతూ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇలాంటి సంప్రదాయం ఏపీ రాజకీయాలకు మంచిది కాదనేది కొంతమంది వాదన. ప్రతిపక్షాల పోరాటం ప్రభుత్వంతోనే కానీ, ప్రభుత్వ ఉద్యోగులతో ఉండకూడదు. అదే జరిగితే వ్యవస్థలపై ప్రజలకు కూడా చిన్నచూపు ఏర్పడుతుంది. ఐపీఎస్ ను వైపీఎస్ అంటూ, ఐఏఎస్ ను వైఏఎస్ అంటూ నిందిస్తూ కాలం గడిపితే.. అది ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం. వ్యవస్థలతో యుద్ధం టీడీపీకి లాభమో నష్టమో చెప్పలేం కానీ, ప్రజాస్వామ్యానికి మాత్రం అది తీరని నష్టం కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

First Published:  15 Jan 2021 11:39 PM GMT
Next Story