వంద సీట్లు పక్కా.. మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​హాసన్​

తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 100 సీట్లు గెలుచుకోవడం పక్కా అని మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​హాసన్​ ధీమా వ్యక్తం చేశారు. తాను ఎక్కడికెళ్లినా ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతం పలుకుతున్నారన్నారు. తమ పార్టీకి ప్రజల్లో విశేష ఆదరణ వస్తున్నదని చెప్పారు. దీని గురించి ఇప్పటికే తమిళనాడులోని పార్టీలకు తెలుసని చెప్పారు. కాగా కమల్​హాసన్​ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. దాదాపు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటించారు. నాలుగు దశల్లో ప్రచారాన్ని పూర్తిచేశారు. ఐదో దశ ప్రచారంలో భాగంగా కోయంబత్తూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా విభిన్న రాజకీయాలు చేసేందుకు మక్కల్ నీది మయ్యం పార్టీ పుట్టుకొచ్చిందన్నారు.

తాము ఎన్నికల్లో గెలిస్తే ఏం చేయబోతున్నామో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ది కుంటుపడిందని.. దానిని గాడిలో పెడతామని చెప్పారు. తాను కచ్చితంగా అసెంబ్లీకి పోటీచేస్తానని చెప్పారు. చెన్నై నగరంలోని మైలాపూర్​ స్థానం నుంచి పోటీచేస్తానని వచ్చిన వార్తలన్నీ రూమర్లేనని కొట్టిపడేశారు. తాను ఎక్కడినుంచి పోటీచేయబోతున్నానో.. త్వరలోనే ప్రకటిస్తానన్నారు. పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాజకీయాల కోసం సర్దుబాట్లు అవసరమని.. ఇందుకోసం అన్ని పార్టీలు పెద్దమనసుతో ముందుకు రావాలని సూచించారు.

మరోవైపు కమల్‌ హాసన్‌ పార్టీకి కానుం పొంగల్‌ రోజున భారత ఎన్నికల సంఘం తీపికబురు చెప్పింది. మక్కల్‌ నీది మయ్యంకు ఎన్నికల సంఘం టార్చ్‌లైట్‌ను ఎన్నికల చిహ్నంగా కేటాయించినట్టు కమల్‌హాసన్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించారు. తొలుత మక్కల్‌ నీది మయ్యంకు టార్చ్‌లైట్‌ను కేటాయించిన ఎన్నికల సంఘం ఆ తర్వాత బ్యాట్‌ను కేటాయించింది. అయితే, తమకు టార్చ్‌లైట్‌ను చిహ్నంగా కేటాయించాలని కోరుతూ ఎంఎన్‌ఎం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి బ్యాటరీ టార్చ్‌లైట్ ను ఎన్నికల గుర్తుగా కేటాయించినట్టు ఈసీ వెల్లడించిందని కమల్‌హాసన్‌ తెలిపారు.