Telugu Global
International

అధికార మార్పిడికి ముందు అమెరికాను వెంటాడుతున్న భయం

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో దేశంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అధ్యక్ష పీఠాన్ని వీడడానికి ససేమిరా అంటూ ట్రంప్ సృష్టించిన అరాచకాన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. మరోమారు ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టిస్తారనే అనుమానంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దేశ రాజధాని వాషింగ్టన్ సహా 50 రాష్ట్రాల రాజధానుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అధికార మార్పిడి నేపథ్యంలో దేశంలో అల్లర్లు […]

అధికార మార్పిడికి ముందు అమెరికాను వెంటాడుతున్న భయం
X

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో దేశంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అధ్యక్ష పీఠాన్ని వీడడానికి ససేమిరా అంటూ ట్రంప్ సృష్టించిన అరాచకాన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. మరోమారు ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టిస్తారనే అనుమానంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దేశ రాజధాని వాషింగ్టన్ సహా 50 రాష్ట్రాల రాజధానుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.

అధికార మార్పిడి నేపథ్యంలో దేశంలో అల్లర్లు జరిగే అవకాశముందంటూ ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ జారీచేసిన హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరో మూడు రోజుల్లో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడనుండడంతో ఏ క్షణంలోనైనా అల్లర్లు జరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. జనవరి 6 కేపిటల్ భవనంపై దాడి లాంటి ఘటనలు మళ్లీ జరిగే అవకాశముందని అనుమానిస్తున్నారు.

కేపిటల్ భవనంపై దాడి సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మరోమారు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులు భద్రతా బలగాలకు సూచించారు. ఇప్పటికే మిషిగన్‌, వర్జీనియా, విస్కాన్సిన్‌, పెన్సిల్వేనియా, వాషింగ్టన్‌ రాష్ట్రాల గవర్నర్లు ఫెడరల్‌ బలగాల్ని రంగంలోకి దించారు.

అధికార మార్పిడి నేపథ్యంలో ఆయుధాలతో కూడిన ర్యాలీలు నిర్వహించాలని ఫార్ – రైట్ ఆన్‌లైన్ ఫోరమ్ పిలుపునిచ్చినట్టు అమెరికా మీడియా పేర్కొంది. దీంతో విస్కాన్సిన్‌, మిషిగన్‌, పెన్సిల్వేనియా, అరిజోనా రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఏ క్షణంలోనైనా ట్రంప్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధానిలో అత్యవసర స్థితి కొనసాగుతోంది. కూడళ్లు, రెస్టారెంట్లు, చారిత్రక ప్రదేశాలు, అధికార భవనాల వద్ద భద్రతను పెంచారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అధికార మార్పిడికి ముందు ఇలాంటి వాతావరణం నెలకొనడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది.

First Published:  17 Jan 2021 7:54 AM GMT
Next Story