సెట్స్ పైకొచ్చిన రామ్ చరణ్

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు రామ్ చరణ్. ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి కూడా వచ్చేశాడు. అవును.. ఆచార్య సినిమా సెట్స్ పైకి వచ్చాడు చరణ్. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన ఓ పాత్రను రామ్ చరణ్ పోషించబోతున్న సంగతి తెలిసిందే. 20 నిమిషాల నిడివి కలిగిన ఈ పాత్రకు సంబంధించి ఇవాళ్టి నుంచి షూటింగ్ మొదలైంది.

కొత్త షెడ్యూల్ తో పాటు రామ్ చరణ్ పాత్ర విశేషాల్ని కూడా బయటపెట్టాడు దర్శకుడు కొరటాల శివ. ఆచార్య సినిమాలో సిద్ధ అనే పాత్రలో కనిపించబోతున్నాడు చరణ్. ఇదొక స్టూడెంట్ లీడర్ పాత్ర అంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆ విషయాన్ని దర్శకుడు ఇంకా నిర్థారించలేదు. వెనక వైపు నుంచి రామ్ చరణ్ పై తీసిన స్టిల్ ను మాత్రం రిలీజ్ చేశాడు.

ఆచార్య సినిమా కోసం 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ శివార్లలో భారీ టెంపుల్ టౌన్ సెట్ వేశారు. ఆ సెట్ లోనే చరణ్ షూటింగ్ కొనసాగుతోంది. సింగిల్ షెడ్యూల్ లో చరణ్ కు సంబంధించిన షూట్ మొత్తం పూర్తయ్యేలా ప్లాన్ రెడీ చేశాడు కొరటాల.